TDP won three seats in the MLC elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 13వ తేదీన జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలువగా, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల ఫలితం.. తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరికి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి.. అధికార పార్టికీ గట్టి షాకిచ్చింది. ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ, వైసీపీలు బలపరిచిన అభ్యర్థుల మధ్య నరాలు తెగె ఉత్కంఠగా సాగిన పోరులో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల రెడ్డి గెలుపొందారు.
కడప జిల్లాలో టీడీపీ శ్రేణులు సంబరాలు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులకు చెందిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల రెడ్డి గెలుపొందడంతో కడప జిల్లాలోని టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున బాణా సంచాలు కాల్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తలంతా ఒకచోటికి చేరి కేకులు కట్ చేసి, మిఠాయిలను తినిపించుకున్నారు.
ఈ క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపొందరని.. సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మద్దతుగా టీడీపీ శ్రేణులు గ్రామంలో బాణాసంచాలు కాల్చుతూ.. సంబరాలు చేసుకుంటుండగా, అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి రాళ్లదాడికి వరకు వెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంతో వారిని పులివెందుల ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లాలో అంబరాన్నంటిన సంబరాలు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో కర్నూలు జిల్లాలోని టీడీపీ నేతలంతా సంబరాలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ కార్యాలయాల ముందు బాణా సంచాలు కాల్చుతూ.. మిఠాయిలు పంచుకున్నారు. ఈ విజయం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నాంది అని నినాదాలు చేశారు. పట్టభద్రులు సరైన నిర్ణయం తీసుకొని..టీడీపీని గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచారని తెలుసుకున్న.. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, దేవనకొండ, ఆస్పరి, ఓర్వకల్లు, గూడూరులోని కార్యకర్తలు బాణా సంచాలు కాల్చుతూ.. సంబరాలు చేసుకున్నారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ సంబరాలు: పశ్చిమ రాయలసీమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో అనంతపురం జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు చేసుకున్న సంబరాలు అంబరాన్నంటాయి. కార్యకర్తలంతా ఒక చోటికి చేరి భారీ ఎత్తున బాణ సంచాలు కాల్చారు. అనంతరం ఆనందంతో ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ అధిష్టానంతో రెండు రోజుల నుంచి జిల్లా కేంద్రంలోని తిష్ణ వేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ మహేశ్వర నాయుడు తన ఆనందాన్ని మిఠాయిల రూపంలో పంచిపెట్టగా.. పట్టణంలో పలు ప్రాంతాల్లో బాణ సంచాలు పేల్చుతూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మరోవైపు MLC ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో జెసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కోట్లకు కోట్లు ఖర్చుపెట్టిన గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ పనైపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకి 170 స్థానాలు కాదు కదా.. ఒక్కటి కూడా గెలవలేరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని.. ప్రజలకు మంచి జరుగుతుందని జెసీ తెలిపారు.
ఇవీ చదవండి