UTF Agitation: షోకాజ్ నోటీసులు, అక్రమ సస్పెన్షన్లతో ఉపాధ్యాయులను వేధించడం మానుకోకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని.. యూటీఎఫ్ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం, అదే విధంగా అధికారుల కక్ష సాధింపు చర్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. బోధనేతర పనులు రద్దు చేయాలని, త్వరితగతిన తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పర్యవేక్షణ పేరిట ఉపాధ్యాయులపై ఉన్నతాధికారుల వేధింపులు, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అక్రమ సస్పెన్షన్లను చేయడం వెంటనే ఆపకుంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని.. యూటీఎఫ్ సంఘాల నేతలు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ సర్కార్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద మెడకు ఉరి తాళ్లు కట్టుకుని టీచర్లు నిరసన తెలిపారు.
సకాలంలో పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకుండా.. ఇప్పుడు సిలబస్ పూర్తి చేయలేదని తమపై నెపం వేస్తున్నారని కాకినాడలో ఉపాధ్యాయులు వాపోయారు. అకారణంగా మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేయడం అధికారులకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. కడపలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మహావీర్ కూడలి నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉన్నతాధికారులు ఉపాధ్యాయులను బెదిరించడం మంచి పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
కావాలనే కక్ష కట్టి తనిఖీల పేరుతో వేధిస్తున్నారని నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాప్‌ల పేరుతో విద్యావ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని.. కర్నూలులో యూటీఎఫ్ నాయకులు ఆరోపించారు. ఉపాధ్యాయుల్ని బోధనేతర పనులకే పరిమితం చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పాదయాత్ర సాక్షిగా చెప్పిన ఆయన ఇప్పుడు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణంగా ఉందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలు ఇస్తామని పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటివరకు వాటి గురించి పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. విజయవాడలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినప్పటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులను ఏదో ఒక రీతిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.
"విద్యార్థుల మానసిక పరిస్థితి బట్టి టైమ్ టేబుల్ రెడీ చేశారు. కానీ ఈ రోజు బైజూస్ వస్తోందని దాని ప్రకారం టైమ్ టేబుల్ ప్రిపేర్ చేశారు. ప్రస్తుతం ఏదో ఒక రకంగా ఉపాధ్యాయులపై తప్పు నెట్టాలని చూస్తున్నారు". - యూటీఎఫ్ నేత
ఇవీ చదవండి: