ముంపు బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సోమశిల ప్రాజెక్టు ముంపు నిరుద్యోగుల ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. సోమశిల పరివాహక ప్రాంతాల్లో 1200 మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట మౌనదీక్ష చేపట్టారు. నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 300 మందికి, చంద్రబాబు నాయుడు హయాంలో 50 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇంకా 1200 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేస్తుందని సోమశిల ముంపు బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:తాగునీటి కోసం రోడెక్కిన మహిళలు