Road Condition in YSR district: అది ముఖ్యమంతి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న.. ఉక్కు పరిశ్రమకు వెళ్లే రహదారి. ఈ పరిశ్రమకు గత నెలలో రెండోసారి భూమి పూజ కూడా చేశారు. అలాంటి రహదారి ఎంత సుందరంగా ఉంటుందో అనుకుంటున్నారేమో కదా.. అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఆ రోడ్డులో వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రహదారి మధ్యలో భారీ గోతులు పడి ఉన్నాయి. దానికితోడు రోడ్డు మొత్తం పూర్తిగా పాడవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి దీనికి కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. దీంతో రాత్రివేళలో ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటేనే వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏ గోతిలో పడతామోనని బయపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారులపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. అందుకు ఈ రహదారే ఓ చక్కటి ఉదాహరణ అని ప్రజలు అనుకుంటున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఉక్కు కర్మాగారానికి వెళ్లే రహదారి దుస్థితి దారుణంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం కన్యతీర్థం రహదారి పరిస్థితి దారుణంగా ఉంది. జమ్మలమడుగు కొత్త రోడ్డు నుంచి సుమారు 11 కిలోమీటర్లు ఈ రోడ్డు వెళ్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉక్కు పరిశ్రమ ప్రతిపాదిత ప్రాంతానికి వెళ్లే రహదారి కూడా ఇదే. గత ఫిబ్రవరి నెలలో సీఎం జగన్ హాజరై వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ పనులకు రెండో సారి భూమి పూజ చేశారు. అక్కడికి వెళ్లాలంటే ఈ దారి ద్వారా వెళ్లాల్సింది.
సుమారు మూడేళ్లుగా దారి కనీసం మరమ్మతులు కూడా నోచుకోవడం లేదు. మధ్య మధ్యలో పెద్ద పెద్ద గోతులు వాహనదారులకు ఇబ్బంది పెడుతున్నాయి. తరచూ రోడ్డు ప్రమాదం జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. సిరిగేపల్లె, సున్నపురాళ్లపల్లె, కన్నె తీర్థం తదితర గ్రామాలకు ప్రజలు ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రివేళలో ప్రయాణం చేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సున్నపురాళ్లపల్లి వద్ద కల్వర్టు వద్ద గుంత ఉంది. కల్వర్టు మొత్తం పడగొట్టి కొత్తది ఏర్పాటు చేసేందుకు సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామని అధికారులు చెబుతున్నారు. గుత్తేదారులు ముందుకు వస్తే త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇవీ చదవండి: