గండికోట జలాశయంలో నీళ్లు నింపాలన్న ఆతృతతప్ప.. ఇబ్బందులు పట్టని అధికారుల తీరుకు నిదర్శనంగా పునరావాస కాలనీలు దర్శనమిస్తున్నాయి. తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి ముద్దనూరు-తాడిపత్రి రహదారి పక్కన, చామలూరు, ఎర్రగుడి గ్రామాల ప్రజలకు వేర్వేరు చోట్ల పునరావాస కేంద్రాలను కేటాయించారు. అక్కడ తాగునీరు, రోడ్లు, మురుగుకాల్వలు, విద్యుత్తు సౌకర్యం, శ్మశాన వాటికలను ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి. జలాశయంలో నీటినిల్వపై కలెక్టర్ ప్రకటన చేసి 5 నెలలు కావస్తున్నా వసతుల కల్పన పూర్తికాలేదు. తాళ్లప్రొద్దుటూరులో ఇంకా 300 మందికి పరిహారం చెల్లించాలి. కొంతమందికి పునరావాస ప్లాట్ల్లూ కేటాయించలేదు. అయినా నీటినిల్వ పేరుతో విద్యుత్తు సౌకర్యాన్ని నిలుపుదల చేసి గ్రామాలను ఖాళీ చేయించారు.
'ప్రభుత్వ చర్యలతో గండికోట నిర్వాసితులకు ఇబ్బంది కలిగే ఉంటుంది. మీ బిడ్డ పొరపాటు చేసి ఉంటే మన్నించాలి. వాళ్ల త్యాగంతోనే లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలుగుతున్నాం. శ్రీశైలంలో నిండుగా ఉన్నప్పుడే సీమకు నీటిని తరలించాలనే ఉద్దేశంతో జలాశయాల్లో ఎక్కువ నీటిని నిల్వచేశాం. నిర్వాసితులతో ఇళ్లు ఖాళీ చేయించాం. ఇది కొంచెం కష్టమైనా ప్రభుత్వానికి సహకరించినందుకు కృతజ్ఞతలు. మరో 2నెలల్లో నిర్వాసితుల ఇబ్బందులు పరిష్కరించి వారి ముఖాలపై చిరునవ్వు వచ్చేలా కలెక్టర్ కృషిచేయాలి.'
- ఇటీవల కడప జిల్లా పర్యటనలో సీఎం జగన్ వ్యాఖ్యలు
నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అధికారులకు సీఎం ఇచ్చిన గడువు రెండు నెలలు. వాస్తవానికి గతేడాది ఆగస్టు 7వ తేదీనే గండికోట జలాశయంలో నీటి నిల్వపై జిల్లా కలెక్టర్ ముంపువాసులతో గ్రామసభ నిర్వహించి ‘పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. ఇళ్లు ఖాళీచేయాలి’ అని తెలిపారు. కానీ 5 నెలల తర్వాత డిసెంబరు నెలాఖరులో జలాశయంలో 26.85 టీఎంసీలు నింపి నిర్వాసితులు గ్రామాలను విడిచి వెళ్లేనాటికీ కేంద్రాల్లో కనీస వసతులు లేవు. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పునరావాస కేంద్రాల్లో వసతుల లేమి, నిర్వాసితులు పడుతున్న కష్టాలపై ‘ఈనాడు డిజిటల్’ ప్రత్యేక ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలన కథనం.
ఒక్కో గుడారంలో 10 మంది
నిర్వాసితులు పునరావాస కేంద్రాల్లో చిన్నపాటి గుడారాలు, రేకులషెడ్లు ఏర్పాటుచేసుకుని ఒక్కో దాంట్లో 7-10 మంది ఉంటున్నారు. సామగ్రి అంతా బయటే ఉంటోంది. మంచు ధాటికి గుడారాల నుంచి నీటిచుక్కలు కారుతున్నాయి. చిన్నారులు, వృద్ధులను గుడారాల్లో ఉంచి, కొంతమంది ఆరుబయటే నిద్రిస్తూ అవస్థలు పడుతున్నారు. మరికొందరు కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాల్లో తలదాచుకుంటున్నారు.
ఒకరు కాపలా ఉంటేనే మరొకరి స్నానం
గుడారాలు, రేకుల షెడ్డు, తాత్కాలిక శిబిరాల్లో ఉండేవారు స్నానం చేసేందుకు ఆరుబయట కట్టెలు పాతుకుని వాటికి చీరలు అడ్డుగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ స్నానాలు చేసేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడ్డాక బయట ఒకరు కాపలా ఉంటే మరొకరు వెళ్లి స్నానం చేస్తున్నారు. మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు ఉన్నా.. చాలావాటిలో నీరు పడలేదు. దీంతో ట్యాంకర్ల నీటినే ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు.
అందని ఉచిత ఇసుక
పునరావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితమని అధికారులు ప్రకటించినా.. అమలు కావట్లేదు. రీచ్‌ల నుంచి పునరావాస గ్రామాలకు తేవాలంటే టిప్పరు ఇసుకకు రూ.7-12 వేల వరకు చెల్లిస్తున్నారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న వారం, పది రోజులకూ ఇసుక రావట్లేదు. ఒకేసారి వందల సంఖ్యలో ఇంటి నిర్మాణాలు మొదలవ్వడంతో కూలీలకు డిమాండ్ పెరిగి అధికంగా చెల్లించాల్సి వచ్చి, నిర్మాణ వ్యయం పెరుగుతోంది.
మొత్తం ముంపు గ్రామాలు 22
మొదటివిడతలో ముంపునకు గురైనవి 15
(వీటికి పరిహారం చెల్లింపు, పునరావాస కేంద్రాల ఏర్పాటు (కొండాపురం మినహా) పూర్తయింది)
రెండో విడతలో ముంపునకు గురైనవి 7నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వివరాలు..
ఏకమొత్తం పరిహారం (ఓటీఎస్) 10,00,000
పునరావాసం కోరుకుంటే 7,00,000, 5 సెంట్ల స్థలం
బతికేందుకు అవకాశం లేదు
పునరావాస కేంద్రంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. నలుగురు చిన్న పిల్లలున్నారు. తినేందుకు తిండి లేదు.. పశువులకు మేత లేదు. ఆరుబయటే స్నానం చేస్తున్నాం. ఇళ్లు కట్టుకుందామంటే భర్తకు, బిడ్డ కూతురికి పరిహారం అందలేదు. మేం బతికేందుకూ అవకాశం లేదు.
-నాగలక్ష్ముమ్మ, నిర్వాసితురాలు
వరండాలోనే పాఠాలు
తాళ్లప్రొద్దుటూరులోని ఉన్నతపాఠశాలను సుగుమంచిపల్లెకు తరలించారు. ఇక్కడ సరైన మరుగుదొడ్లు లేవు. నీటి సౌకర్యం లేదు. గ్రామం నీట మునగడంతో తాడిపత్రిలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. రోజూ 15 కిలోమీటర్లు ఆటోలో బడికి వస్తున్నాం. బస్‌పాస్ ఇవ్వలేదు. తరగతి గదులు లేక వరండాలో పాఠాలు చెబుతున్నారు.
-స్మృతి, పదో తరగతి విద్యార్థిని
నాలుగు మరుగుదొడ్లూ కట్టలేరా?
పునరావాస కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యం, నీరు, రహదారులు పూర్తిస్థాయిలో లేవు. నిర్మాణవ్యయం భారీగా పెరిగింది. ఇసుకే బంగారం అన్నట్లుంది. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీతో కొట్టం తప్ప ఇల్లు నిర్మించుకోలేరు. మరుగుదొడ్డికి వెళ్లాలంటే మహిళల అవస్థలు వర్ణనాతీతం. అధికారులు కనీసం నాలుగు మరుగుదొడ్లను నిర్మించలేరా?
-రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచి
వేగంగా మౌలిక వసతుల కల్పన
సంక్రాంతి నుంచి నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా రీచ్‌లు ఏర్పాటుచేస్తాం. నిర్వాసితులు కొంతమంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. మరికొందరు కేంద్రాల్లోనే టెంట్లు వేసుకుని ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన వేగంగా చేపడుతున్నాం.
-నాగన్న, జమ్మలమడుగు ఆర్డీవో
ఇదీ చదవండి: కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుపై రగడ.. విశాఖ వద్దంటున్న సాగునీటి సంఘాల సమాఖ్య