Protest Against Temple Land Auction: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెద్దదుద్యాల గ్రామంలోని శ్రీ వరదరాజులస్వామి ఆలయం భూముల వేలంపాట వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆలయంలో దూపదీప నైవేద్యాల కోసం దాతల ఇచ్చిన 107 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తరతరాలుగా సాగుచేసుకుంటున్నారు. వారే ఆలయానికి పూజారులుగా వ్యవహరిస్తూ.. పంటలపై వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, దూప దీప నైవేద్యానికి వెచ్చిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఈ కుటుంబాలకు చెందిన వ్యక్తులు హాజరయ్యారు. ఆగ్రహించిన అధికారపార్టీ నేతలు.. దేవాదాయశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి వారు సాగుచేసుకుంటున్న భూములకు వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఏళ్ల తరబడి ఆ భూములు సాగు చేసుకుంటున్న 30 కుటుంబాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేలంపాటు రద్దు చేయాలని పట్టుబట్టారు. పోలీసుల జోక్యంతో అధికారులు వేలం పాట నిర్వహించేందుకు మొగ్గు చూపారు. తామ జీవనాధారమైన భూములకు కేవలం జమ్మలమడుగు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆదేశాలతోనే దేవాదాయశాఖ అధికారులు వేలం పాట నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వారం కిందట ఎమ్మెల్యేని కలిసి విన్నవించుకున్నా.. ఇష్టానుసారంగా మాట్లాడి పంపించి వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫురుగులమందు తాగిన ఇద్దరు మహిళలు: ఇదే సమయంలో వేలం పాటను అధికారులు కొనసాగిస్తుండగా.. తట్టుకోలేని బాధిత కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వారిలో ఓ మహిళ నుంచి పురుగుమందు డబ్బాను పోలీసులు లాక్కున్నారు. లక్ష్మీదేవి అనే మహిళ పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను హుటాహుటిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో యువకుడు కాశీ కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కనీసం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఏ విధంగా వేలం పాట నిర్వహిస్తారని బాధితులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే చెప్పడంతోనే ఈ వేలం పాట నిర్వహిస్తున్నారని బాధితులు ఆక్రోశించారు.
బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను వేలం వేయించడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు.. బీసీలు, బడుగుల కడుపు కొట్టే చర్యలకు పాల్పడ్డారని.. వెంటనే వేలం పాటను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వేలం పాటను రద్దు చేసి భూములను బాధితులకు అప్పగించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.