ప్రొద్దుటూరు.... వర్తక వ్యాపార వాణిజ్యాలకు పెట్టింది పేరు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం.. విద్య పరంగానూ ముందంజలో ఉంది. ప్రభుత్వ పాఠశాలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు చదువుకునేందుకు వేలాదిమంది విద్యార్థులు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఐటిఐ కళాశాల లేకపోవటం.. వృత్తి విద్యా కోర్సులపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సమస్యగా మారింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రతి ఏటా 3 వేల 500 మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసి బయటకు వెళ్తున్నారు. వీరందరూ వివిధ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా మరికొందరు ఐటిఐ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి.. పట్టణంలో నాలుగు ప్రైవేట్ కళాశాలలు అందుబాటులో ఉన్నా.. అవసరమైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు.
జిల్లాలోని ఎర్రగుంట, జమ్మలమడుగులో ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి అంతదూరం వెళ్లేందుకు అమ్మాయిలకు సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులూ ఈ దిశగా ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు ఈ దిశగా కృషి చేసి.. తమ ప్రాంతానికి ప్రభుత్వ ఐటీఐ మంజూరు చేయిస్తే.. పరిసర ప్రాంతాల విద్యార్థులకూ ఉపయుక్తంగా ఉంటుందని ప్రొద్దుటూరువాసులు కోరుతున్నారు.