కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలంలో దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో రైతులు తమలపాకు తోటలు సాగుచేస్తుంటారు. అందరి నోళ్ళు పండించే ఈ రైతులకు లాక్‌డౌన్ కారణంగా తీరని కష్టాలు వచ్చాయి. ఎకరా తోట సాగు చేసేందుకు 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు 400 నుంచి 500 రూపాయల వరకు అమ్మిన తమలపాకు బుట్టను ఇప్పుడు అడిగే వారే లేకుండా పోయారు. ఆకు కోయకపోవడంతో తోటల్లోనే పండిపోతోంది. ఓబులవారిపల్లె మండలం నుంచి లాక్‌డౌన్‌కు ముందు దాదాపు ఆరువేల తమలపాకు బుట్టలు హైదరాబాద్‌కు రవాణా అయ్యేవి...ఇప్పుడు బుట్ట కూడా తరలించేందుకు అవకాశం లేకుండా పోయిందంటూ రైతులు వాపోతున్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి, నెల్లిమర్ల,కొత్తపేట, మెరకముడిదం,ఉత్తరవల్లి, రామభద్రపురం మండలాల్లో దాదాపు 60 ఎకరాల్లో తమలపాకు తోటలు ఉన్నాయి. లాక్‌డౌన్ వల్ల నెల రోజులుగా మార్కెట్ లేకపోవడంతో తోటల్లోనే ఆకులు పండి నేలరాలిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారమే కోల్పోయామంటూ తమలపాకు రైతులు వాపోతున్నారు.
ఇక నెల్లూరు జిల్లాలోని ఇనమడుగు, లేగుంటపాడు, వింజమూరు, అనంత సాగరం తదితర ప్రాంతాలలో దాదాపు ఐదువేల ఎకరాల్లో తమలపాకు తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా నుంచి ప్రతి రోజు 50 టన్నుల తమలపాకులు చెన్నై, బెంగళూరు, ముంబై, రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. కరోనా ప్రభావంతో నెల రోజుల నుంచి పూర్తిగా రవాణా సౌకర్యం నిలిచిపోయిందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా తమలపాకు తోటల రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా తమలపాకు అమ్ముకోవాలంటే ప్రత్యేక అనుమతులు ఇస్తామని అధికారులు చెప్పారు.
తమలపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేకపోవటంతో, పండిన పంటంతా నేలపావుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపరిస్థితుల్లో ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఆర్థికంగా ఆదుకోవాలంటూ తమలపాకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: