ప్రసవం కోసం వచ్చిన మహిళ మరణంతో.. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ.. మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.
గోపవరం మండలం బుచ్చనపల్లికి చెందిన విష్ణు ప్రియను ప్రసవం కోసం బద్వేల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం తల్లి, కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు కడప ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వారు ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే.. మార్గంమధ్యలోనే విష్ణుప్రియ మృతి చెందింది. దీంతో ఆగ్రహానికిలోనైన బంధువులు.. మృతదేహంతో ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
విషయం తెలసుకున్న ఆసుపత్రి నిర్వాహకులు తాళం వేసి వెళ్లిపోయారు. మృతురాలి బంధువులు ఆస్పత్రి గేటును పగలకొట్టి.. ఆస్పత్రి ఆవరణలో మృతదేహంతో నిరసన చేపట్టారు. మరోవైపు పుట్టిన బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో.. బాబును నెల్లూరుకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: Pregnant Died: సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి