కడపజిల్లా యర్రగుంట్ల వద్ద నున్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో ఆరు యూనిట్ల ద్వారా 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాయలసీమకే తలమానికమైన ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టును 1988లో స్థాపించారు. 3 వేలకు పైగానే ఉద్యోగులు, కార్మికులు ఉన్న ఈ సంస్థ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు ఆరు నెలల ముందు నుంచి విద్యుత్ ఉత్పత్తిలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.
లాక్డౌన్ సమయంలో కేవలం ఒకటి, రెండు యూనిట్ల ద్వారా అంటే 420 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తూ వచ్చిన ఆర్టీపీపీ యాజమాన్యం.... జూన్ 7వ తేదీ నుంచి ఉత్పత్తి పూర్తిగా నిలిపివేశారు. ఆరు యూనిట్లలో 1650 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఏపీ జెన్ కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉత్పత్తి నిలిపివేయడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న థర్మల్ పవర్ ప్రాజెక్టును కాపాడాల్సిన ప్రభుత్వం... మూసివేత దిశగా చర్యలు చేపట్టడం మంచిది కాదని ఉద్యోగులు అంటున్నారు.
దాదాపు 300 మంది ఉద్యోగులను ఇతర యూనిట్లకు బదిలీ చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకోవటంతో ఉద్యోగుల ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు.. ఆర్టీపీపీలో అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వం చర్యలు తీసకోవాలి గానీ... ఉద్యోగుల కడుపు కొట్టవద్దని ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీపీపీని ఎన్టీపీసీలోకి విలీనం చేస్తారనే ప్రతిపాదన కూడా వచ్చింది. దీంతో మరింత ఆందోళనకు గురైన ఉద్యోగులు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పరిస్థితులపై కిషన్ రెడ్డికి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు