రాయలసీమ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు నెలలుగా పూర్తిగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. రూ.10 వేల కోట్ల కర్మాగారం ఇప్పుడు నిరుపయోగంగా మిగిలిపోయింది.. ఇందులో భాగంగానే ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో పవన, సౌర విద్యుత్తు తక్కువ ధరకు లభిస్తుండటం.. వర్షాలు పుష్కలంగా కురుస్తుండటమే థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపివేయడానికి కారణమని వారు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే దాదాపు రూ.10 వేల కోట్ల విలువచేసే ఆర్టీపీపీ నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవధిలో పరిశ్రమలోని విలువైన భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, భారీగా నిల్వ ఉన్న బొగ్గు కూడా నాణ్యత కోల్పోయే ఆస్కారముందని అంటున్నారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్యను, లో ఓల్టేజీ ఇబ్బందులను పరిష్కరించడానికి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆర్టీపీపీకి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 420 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1994-95 మధ్యకాలంలో ఉత్పత్తిని ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. 6 యూనిట్లకు పెంచడం ద్వారా విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 1,650 మెగావాట్లకు పెంచారు.
- పేరుకుపోయిన బొగ్గునిల్వలు
ఆర్టీపీపీలో పూర్తిస్థాయిలో 1,650 మెగావాట్ల మేర విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే రోజుకు దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. సంవత్సర కాలంలో ఆర్టీపీపీలో ఉత్పత్తిని తగ్గించడం వల్ల దాదాపు రూ.200 కోట్లపైగా విలువైన.. 4.6 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి.
విద్యుదుత్పత్తిపై సమాచారం లేదు
ఆర్టీపీపీలో వచ్చే ఏడాది మార్చి వరకు ఉత్పత్తి జరగదన్న విషయమై నాకు ఎలాంటి సమాచారం అందలేదు. అంతవరకు ఉత్పత్తి చేపట్టకపోతే బొగ్గు పూర్తిగా నాణ్యత కోల్పోతుంది. యంత్రాలకైతే ఎలాంటి నష్టం ఉండదు.
- సుబ్రహ్మణ్యం, ఆర్టీపీపీ సీఈ
ఇదీ చూడండి: చీరాలకు చేరుకున్న కిరణ్కుమార్ మృతదేహం