కడప జిల్లా సుండుపల్లి మండలం జంగంపల్లిలో నెల రోజుల కిందట అదృశ్యమైన అక్కాచెల్లెళ్లను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. చెన్నైలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఆ మహిళలను... అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ కలహాలతోనే వారు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని పోలీసుల విచారణలో తేలింది.
జరిగింది ఇదీ
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లెకు చెందిన ఉషారాణి, వాణిలు అక్కాచెల్లెళ్లు. వీరికి కడప జిల్లా సుండుపల్లి మండలానికి చెందిన అన్నదమ్ములతో వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత అత్తింటివారి వేధింపులతో తరచూ గొడవలు జరిగేవి. పెద్దల సమక్షంలో రాజీయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో ఉషారాణి, వాణిలు అక్టోబర్ 17న అదృశ్యమయ్యారు. అత్తారింటి వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ మహిళల తండ్రి సుండుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు... అదృశ్యమైన మహిళలు చెన్నైలోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. హుటాహుటిన చెన్నైకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని సురక్షితంగా కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు.