Owner took away debtor wife for Debt not paid: వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం జీవి సత్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని.. సభ్య సమాజం తలదించుకునే విధంగా రుణ గ్రహీత భార్యను.. నర్సరీ యజమాని తీసుకెళ్లడం కలకలం రేపింది. జీవి సత్రం నర్సరీ యజమాని సుధాకర్ రెడ్డి వద్ద ఎస్టీ కాలనీకి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అది చెల్లించకపోవడంతో ఆయన వద్ద పని మానేశాడు. రూ.2 లక్షల అప్పు చెల్లించాలని వారం కిందట నర్సరీ యజమాని సుధాకర్ రెడ్డి... ఎస్టీ కాలనీలో ఉంటున్న సుబ్బరాయుడు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సుబ్బరాయుడు ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య నాగమణిని నర్సరీ యజమాని బలవంతంగా తీసుకెళ్లాడు. రూ.2 లక్షల అప్పు చెల్లించే వరకు మహిళను ఇంటికి పంపించేది లేదని కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పాడు.
మొత్తం కట్టే స్తోమత లేకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో సుబ్బరాయుడు... ఇవాళ మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నర్సరీకి వెళ్లి చంటి బిడ్డతో ఉన్న బాలింత నాగమణిని తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నర్సరీ యజమాని సుధాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పు చెల్లించకపోతే వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవాలి కానీ మహిళను తీసుకెళ్లడమేంటని పోలీసులు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఇవీ చదవండి: