కడప నగరంలో పలు ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. ప్రజలు ఎటు కదలలేని పరిస్థితి నెలకొంది. పాత బస్టాండ్, రవీంద్రనగర్, ద్వారకానగర్ జల దిగ్బందమయ్యాయి. నాగరాజుపేట, బాలాజీ నగర్, తారకరామనగర్ వరదనీటిలోనే ఉన్నాయి. బుగ్గవంక ప్రాజెక్టు నుంచి అధికారులు నీటి విడుదల చేయటంతో వరద నీరు నగరంలోకి చేరుతోంది. మోకాలులోతు వరకు వరద నీరు ఉంది.
వాగులో కొట్టుకుపోయిన కారు
వాగులు ఉద్ధృతి కారణంగా ప్రవాహంలో కొట్టుకుపోతున్న కారులోని డ్రైవర్‌ను.....స్థానికులు కాపాడారు. వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లిలోని తుమ్మలంక వంకలో ప్రవాహం నుంచి కారును బయటకు తీసి....డ్రైవర్‌ను కాపాడారు. పులివెందుల నుంచి కడపకు వెళ్తుండగా ముత్తుకూరు వద్ద రోడ్డు దాటుతుండగా వరద ఉద్ధృతికి.....కారు కొట్టుకుపోయింది. కారులోనే చిక్కుకుపోయిన డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు.పెండ్లిమర్రి మండలం సమైఖ్యనగర్ కాలనీలోకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా కాలనీ వాసులను ఖాళీ చేయించి పెండ్లిమర్రి జూనియర్ కళాశాలలోకి తరలించారు.
సర్వరాయ సాగర్ ప్రాజెక్టు గండ్లు.
గాలేరు-నగరి గండికోట ప్రాజెక్టులో అంతర్భాగమైన సర్వరాయ సాగర్ ప్రాజెక్ట్ మెట్ట ప్రాంత రైతాంగం కోసం నిర్మించబడింది. దీనిని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 సంవత్సరంలో ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు సరిగా పని చేయకపోవడం వలన ప్రాజెక్టుకు గండ్లు పడ్డాయని గ్రామ ప్రజలు తెలిపారు. వర్షానికి ప్రాజెక్టు సమీప గ్రామాలైన ఇందుకూరు తదితర ప్రాంతాల్లో భారీగా వరద చేరుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి