కడపజిల్లా పెండ్లిమర్రి మండలంలోని రైతులు తుపాన్ వల్ల నష్టపోయారు. ఎగువనున్న చెరువు కట్ట తెగటం వల్ల పంటచేలు మునిగిపోయానని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చామంతి, వేరుసెనగ, పొద్దుతిరుగుడు పువ్వు పంటలు మెులకెత్తుతున్న సమయంలో వరద ప్రవాహం వల్ల కొట్టుకుపోయాయన్నారు.
చెన్నమరాజుపల్లె, పెద్దదాసరిపల్లె, ఎల్లటూరు పొలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది.లక్షల్లో పెట్టుబడి పెట్టామని..ఇప్పుడు మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని రైతులు తలపట్టుకుంటున్నారు. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరుతున్నారు.
'ఐదు ఎకరాల్లో బంతి, చామంతి సాగు చేశాను. ఎగువనున్న చెరువు కట్ట తెగటంతో వరద ప్రవాహానికి మొక్కలు పాడైపోయాయి. ఎకరానికి డెభై వేల చొప్పున ఖర్చు చేశాను. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాం. క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి..ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని రెవెన్యూ అధికారులను కోరుతున్నాను' -బాధిత రైతు
డిసెంబర్ 10వ తేదీ లోపు అన్నీ మండలాల్లో పంట నష్టం అంచనా వేస్తామని ఎమ్మార్వో తెలిపారు. 30న తేదీ నాటికి బాధిత రైతులకు పరిహారం అందేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: కడపలో వర్షాలు తగ్గినా తీరని ప్రజల కష్టాలు