కడప జిల్లా మైదుకూరు పురపాలక సంఘం తెదేపా ఛైర్మన్ అభ్యర్థి ధనపాల జగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు.. అక్కడికి చేరుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈనెల 3న నామ పత్రాల ఉపసంహరణకు సమయం ముగిసిన తర్వాత.. ఆర్వో గదిలోకి జగన్ ప్రవేశించి తమ విధులకు ఆటంకం కలిగించారని ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని.. వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిర్ణీత సమయం అనంతరం వైకాపా అభ్యర్థులను లోనికి అనుమతించడాన్ని ప్రశ్నించడానికే.. జగన్ అప్పుడు గదిలోకి వెళ్లారని తెదేపా నేతలు పోలీసులకు వివరించారు. వారిని అనుమతించిన పోలీసులు, అధికారులపైనా చర్యలు తీసుకోవాలని తితిదే పాలకమండలి మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ డిమాండ్ చేశారు. కేసు నమోదు కావడంతో.. స్టేషన్‌కు రావాల్సిందేనని పోలీసులు పట్టుబట్టారు. అందుకు జగన్ అంగీకరించి వారి వెంట నడిచేందుకు సిద్ధంకాగా.. కుటుంబసభ్యులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎట్టకేలకు వాహనంలో ఆయనను తరలించారు. స్టేషన్ వద్దకు చేరుకున్న తెదేపా కడప పార్లమెంట్ విభాగ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి.. కార్యకర్తలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులతో కలసి స్టేషన్ ముందు భైఠాయించి నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: