JAGANANNA MAHILA MART: ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగులో జగనన్న మార్ట్ ఏర్పాటుకు ఆ నగర పంచాయతీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సభ్యులు ఒక్కొక్కరు రూ.150 చొప్పున చెల్లించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిబ్బంది కోరుతున్నారు. డి.మార్ట్ తరహాలో కడప జిల్లాలోని పులివెందుల, రాయచోటి, ప్రకాశం జిల్లా అద్దంకిలో ఇప్పటికే జగనన్న మార్ట్‌లు ప్రారంభించారు. ఇదే తరహాలో జమ్మలమడుగులోనూ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల్లో ఒక్కో సభ్యురాలి నుంచి రూ.150 చొప్పున వసూలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
మెప్మా సిబ్బంది ఈ మేరకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇలా ఫోన్లో చేసిన సూచన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్వయం సహాయక సంఘాల సభ్యులపై ఒత్తిడి చేయట్లేదని, ఆసక్తి ఉన్నవారి నుంచే తీసుకోవాల్సిందిగా తెలిపామని మెప్మా ఎండీ విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రారంభించిన జగనన్న మార్ట్‌లు బాగా పని చేస్తున్నందున... మిగతా జిల్లాల్లోనూ దశలవారీగా ప్రారంభించాలనుకుంటున్నామని ఆమె అన్నారు.
ఇదీ చదవండి:
అన్నదాతను వేధిస్తున్న యూరియా కొరత.. రైతుకు రెండు యూరియా బస్తాలే