కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం.. మామిడి పంటలకు ప్రసిద్ధిగా ఉంది. నియోజకవర్గంలోని కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాలకుపైగా మామిడి తోటలను పెంచుతున్నారు. ప్రతి సంవత్సరం రైల్వే కోడూరు నుంచి పొరుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర దేశాలకు మామిడి పళ్లు ఎగుమతి అవుతుంటాయి.
గతేడాది కరోనాతో ఇబ్బందులు పడిన రైల్వేకోడూరు మామిడి రైతులు.. ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో మామిడి పూత వచ్చిందని సంతోషిస్తున్నారు. దీంతో దిగుబడి వస్తుందని రైతులు ఆశాజనకంగా ఉన్నారు. ఈ క్రమంలో పూత బాగానే వచ్చినప్పటికీ.. తెగుళ్ల వల్ల ఇబ్బందులు తప్పడంలేదని వాపోతున్నారు. ముఖ్యంగా బూడిద తెగులు, తేనె మంచు పురుగు ఉధృతి కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటికి మందులు పిచికారీ చేసినప్పటికీ.. ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ సందర్భంగా తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టేందుకు అవసరమైన మందుల వివరాలను శాస్త్రవేత్తలు తెలపాలన్నారు.
నాసిరకం మందులు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుండడంతో.. వేటిని కొనుగోలు చేయాలో అర్థంకాక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోయారు. మామిడి రైతులకు ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తెగుళ్ల నివారణ చర్యల గురించి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శారద వివరించారు. శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన విధంగా మందులను కొనుగోలు చేసి, తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించుకోవాలని వివరించారు.