ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. మహిళల రక్షణ కోసం.. ఆ వ్యవస్థలో మహిళా పోలీసు సంరక్షణ కార్యదర్శినీ అధికారులు నియమించారు. కానీ.. వారి విధులపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మహిళల రక్షణ కోసం.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంలోనూ సరైన దిశానిర్దేశం లేదు. ఫలితంగా.. అధికారులు చెప్పిన పనులు మాత్రమే చేసుకుంటూ వచ్చారు. ఇకపై ఆ పరిస్థితి మారనుంది. వారి సేవలను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని కడప నగరపాలక సంస్థ భావిస్తోంది.
అందుకోసం మేయర్ సురేశ్ బాబు అధ్యక్షతన... ముఖ్యమంత్రి అంజాద్ బాషా, కమిషనర్ లవన్న, డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని 101 వార్డు సచివాలయాల నుంచి మహిళా పోలీసు సంరక్షణ కార్యదర్శులూ హాజరయ్యారు. వారికి ఉపముఖ్యమంత్రి, మేయర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా.. తాము పోలీసులమనే విషయం ప్రజలకు తెలియజేసి.. మహిళలకు అండగా ఉంటామనే భరోసా కల్పించే విధంగా చూడాలని చెప్పారు.
వార్డు సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి.. కుటుంబాల ట్రాక్ రికార్డు నమోదు చేయాలని.. ఏ సంఘటన జరిగినా ముందుగా మహిళా సంరక్షణ కార్యదర్శికే ఫిర్యాదు చేసేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీసు శాఖలో నిర్వహించే స్పందన కార్యక్రమం సచివాలయంలోనే నిర్వహించాలన్నారు. దొంగతనాలు, ఆకతాయిల అల్లర్లు, వ్యభిచారం వంటి కార్యకలాపాలపై వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని మేయర్ సురేష్ బాబు కోరారు. మహిళా కార్యదర్శలు తరచూ కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు పరిశీలించాలన్నారు. సచివాలయ పరిధిలో శాంతిభద్రతల బాధ్యతలు మహిళా సంరక్షణ కార్యదర్శలే చూసుకోవాలన్నారు. సందేహాలుంటే.. పోలీసులను సంప్రదించాలన్నారు.
ఇదీ చదవండి:
సీఎం జగన్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరోనా విలయతాండవం: అచ్చెన్నాయుడు