పురపాలక సిబ్బంది నిర్లక్ష్యంతో తాము నీటి కోసం ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేటలోని బోయపాలెం వద్ద మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. రెండు నెలలుగా నీరు సక్రమంగా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల అన్ని వీధులకు నీటి సరఫరా చేస్తున్నా... తమకు మాత్రమే ఎందుకు పంపిణీ చేయటం లేదని నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు... పురపాలక కమిషనర్ శ్రీహరిబాబు, ఏఈ మోహన్ అక్కడికి చేరుకున్నారు. ఈదురుగాలులు, వర్షం కారణంగా అన్నమయ్య మంచినీటి పథకం వద్ద రెండు ట్రాన్స్ఫార్మర్లు, పైపులైన్లు దెబ్బతిన్నాయని వివరించారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్నామని... సమస్య ఉంటే కార్యాలయానికి వచ్చి చెప్పాలన్నారు. రోడ్డుపై బైఠాయించటం సరికాదని నచ్చజెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు.
ఇది కూడా చదవండి.