కువైట్‌లో ఆత్మహత్య చేసుకున్న కడప జిల్లా వాసి వెంకటేశ్ మృతదేహం నేడు కడప జిల్లాకు చేరుకోనుంది. వెంకటేశ్ స్వస్థలం లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడుకు మృతదేహాన్ని తరలించనున్నారు. కువైట్‌లో ముగ్గురి హత్య కేసులో వెంకటేశ్ నిందితుడు కాగా.. అక్కడి జైలులో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఏం జరిగిందంటే..
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడుకు చెందిన వెంకటేశ్, భార్య స్వాతి బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. వెంకటేశ్ ఓ ఇంట్లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత నెల 25న ముగ్గురుని హత్య చేసిన కేసులో వెంకటేశ్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆ హత్యలతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని అతని భార్య స్వాతి వెల్లడించారు. "'కువైట్‌లో సేఠ్, అతని భార్య, కూతుర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేరే ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న తన భర్త వెంకటేశ్‌పై కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు. బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లాం. అక్కడ జరిగిన మూడు హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో చేసిన హత్యలకు తన భర్తను శిక్షించడం ఎంతవరకు న్యాయం" అని స్వాతి వివరించారు.
కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన పిల్లొళ్ల స్వాతి.. దిన్నెపాడు కస్పాలోని ఇంటికి చేరారు. అనంతరం.. ఏ తప్పు చేయని నా భర్తను ఎలాగైనా కాపాడాలని లక్కిరెడ్డిపల్లె పోలీసులను ఆశ్రయించారు. వెంకటేష్ వ్యవహారంపై ఇండియన్ ఎంబసీని అక్కడి తెలుగు వారు ఆశ్రయించగా కడప కలెక్టరేటుకు విషయం చేరింది. బాధితుడి భార్య స్వాతి వివరాలివ్వాలని కలెక్టరేట్ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి.
జైలులో ఆత్మహత్య..
ముగ్గురిని హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేశ్ మార్చి 17న ఆత్మహత్య చేసుకున్నారు. కువైట్ దేశంలోని ఆర్ధియా ప్రాంతంలో ఉన్న సెంట్రల్ జైల్లో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. జైల్లో తన శరీరంపై ఉన్న వస్త్రాలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి