రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు. కడప తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆ పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. వివేకా హత్య కేసులో తెదేపా ఎమ్మెల్సీలను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్... ఇప్పుడెందుకు ఆ ఊసు ఎత్తడం లేదని ప్రశ్నించారు. వివేకా కుటుంబ సభ్యులపైనే అనుమానం ఉన్నట్లు ఆయన కుమార్తె చెప్పారన్నారు. ప్రభుత్వ తీరు చూస్తేంటే... కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు ఉందన్నారు. తన కుటుంబ సమస్యనే పరిష్కరించలేని ముఖ్యమంత్రి.. ప్రజాసమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. తెదేపా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడమే వైకాపా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం ఉన్న నిబంధనలకు అనుగుణంగా.. రాజకీయపార్టీలకు పార్టీ భవనాలు కట్టుకునేందుకు భూములు కేటాయిస్తారని చెప్పారు. కడపలో తెదేపాకు కేటాయించిన భూమిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. కోర్టును ఆశ్రయిస్తామని శ్రీనివాసుల రెడ్డి తెలిపారు.
వివేకా హత్య కేసుపై ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏమన్నారంటే...
వివేకా హత్య జరిగితే ఇప్పటివరకూ కేసు తేల్చలేని పరిస్థితి ఉందని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. సొంత చెల్లెలే తనకు ప్రాణహాని ఉందని చెప్తుంటే... రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. తండ్రి హత్యకేసును చిన్నాన్న హత్య కేసునే తేల్చలేని జగన్.. ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగించాలని గతంలోనే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్ వేశారని తెలిపారు. అమాయకులకు శిక్ష పడకూడదనే సీబీఐ విచారణ కోరామన్న బీటెక్ రవి... సీబీఐ విచారణకు జగన్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని నిలదీశారు.
ఇదీ చదవండి : 'అమరావతి సాధనే లక్ష్యంగా పోరాడుతాం'