వారం, పది రోజుల్లో తొలివిడత పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి తెదేపా అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే కడప జిల్లాలో టికెట్లు ఎవరికనేది దాదాపు ఖరారైంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమకు టికెట్ రాదనే అభిప్రాయంతో పార్టీ నేతలు బహిరంగంగా అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా సతీశ్‌కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్న మంత్రి ఆదినారాయణరెడ్డితో కలిసి సతీశ్ రెడ్డి ఇప్పటికే... ప్రచారం మెుదలుపెట్టారు. రాజంపేట నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పేరు ఖరారైంది. ఆయన 10 రోజుల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాయచోటి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ రెడ్డి, ప్రసాద్ బాబు పోటీ పడ్డారు. వీరిద్దరూ చాలాసార్లు ముఖ్యమంత్రి వద్ద సంప్రదింపులు జరిపారు. చివరికి రమేశ్ కుమార్ రెడ్డికే టికెట్ వచ్చేట్టు తెలుస్తోంది. ప్రసాద్‌బాబును బుజ్జగించేందుకు అధిష్ఠానం... తితిదే బోర్డు సభ్యుడి పదవి ఇస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఆయన..రమేశ్ గెలుపు కోసం పనిచేయకతప్పలేదు. మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నా... ఆయనకు కార్పొరేషన్ లేదా తితిదే ఛైర్మన్ పదవి ఇస్తామనే హామీ అధిష్ఠానం ఇచ్చినట్లు సమాచారం. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ సీనియర్ నేత రామసుబ్బారెడ్డికి ఖరారైంది. కడప నియోజకవర్గం తెదేపా టికెట్‌ను ఇటీవల పార్టీలో చేరిన మాజీమంత్రి అహ్మదుల్లా లేదా ఆయన తనయుడు అష్రఫ్‌కు కేటాయించనున్నారు. కడప, రాజంపేటలో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కడప నియోజకవర్గంలో తమను కాదంటే వ్యతిరేకంగా పనిచేస్తామని...లేదంటే స్వతంత్రంగా బరిలో ఉంటామని నేతలు హెచ్చరిస్తున్నారు. రాజంపేటలో స్థానికేతరుడైన చెంగల్రాయుడికి టికెట్ ఇవ్వడంపై మాజీమంత్రి బ్రహ్మయ్య అసమ్మతి గళం వినిపిస్తున్నారు. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు టికెట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఎస్సీ నియోజకవర్గాలైన బద్వేలు, కోడూరులో నేతలు సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచిస్తోంది.
ఇవి కుడా చదవండి