ఒకనాటి కాంగ్రెస్ కంచుకోట... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2సార్లు ముఖ్యమంత్రిని అందించిన ఘనత ఆ జిల్లా సొంతం. దశాబ్దాల నుంచి హస్తం పవనాలు వీచిన ఆ ప్రాంతం... 2014 ఎన్నికల్లో వైకాపాకు కేరాఫ్‌గా మారింది. రాయలసీమ రాజకీయాల అడ్డా అయిన కడప కంచుకోటను మరోసారి కాపాడుకునేందుకు వైకాపా ఎత్తులేస్తుంటే... కృష్ణా జలాలను జిల్లాకు అందించిన అధికార పార్టీ... ప్రత్యర్థి కోటబద్ధలు కొట్టాలన్న కసితో వ్యూహంరచిస్తోంది.
10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలున్న ఇక్కడ.. కిందటి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ దూసుకెళ్లింది. 9 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుని కడప గడ్డ వైకాపా అడ్డా అనేలా ఫలితాలు సాధించింది. అధికార పార్టీ కేవలం ఒక్క రాజంపేట స్థానంతో సరిపెట్టుకుంది. మారిన సమీకరణాలతో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు సైకిలెక్కారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నియోజకవర్గాల్లో ఎవరికి వారు వ్యూహప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మారుపేరైనపులివెందుల నియోజకవర్గం నుంచి ఈసారి ప్రతిపక్షనేత జగన్ బరిలో నిలవనున్నారు. దశాబ్దాల కాలంగా ఆ స్థానంలో వైఎస్ కుటుంబ సభ్యులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి సతీశ్ కుమార్ రెడ్డిపై జగన్ 75 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారీ సతీశ్ కుమార్ రెడ్డే పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పులివెందులకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన ధీమాతో ఓటర్లు తెదేపా వైపు ఉన్నారనే ఆశాభావంతో ఆయన ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే వేడి పుట్టించే నియోజకవర్గం... జమ్మలమడుగు. ఇక్కడి నుంచి తెదేపా తరపున మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పోటీ చేయనున్నారు. అక్కడ సిట్టింగ్‌గా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై గెలిచి సైకిల్ ఎక్కారు. అధినేత చంద్రబాబు సూచన మేరకు ఈసారి ఆయన కడప ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైకాపా తరపున మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. జమ్మలమడుగు సమీపంలోని కంబాలదిన్నె వద్ద రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం సైకిల్ పార్టీకి కలిసోచ్చే అంశంగా కనిపిస్తోంది.
మైదుకూరు నియోజకర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సైకిల్ ఎక్కుతారనే ప్రచారం సాగినా కుదరలేదు. ఒక్క అడుగు ముందుకేసిన డీఎల్.. స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ప్రకటించేశారు. ఇక్కడ వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మళ్లీ బరిలో నిలవనున్నారు. ఎవరు పోటీ చేసినా వెయ్యి కోట్లతో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని పుట్టా ధీమా.
అధికార పార్టీలో అసమ్మతి రాజేస్తున్న నియోజకవర్గం కమలాపురం. ఈసారి తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి పేరు దాదాపు ఖరారైంది.ఈ స్థానాన్ని ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని అధిష్ఠానం బుజ్జగించే పనిలో ఉంది. పుత్తాకు ఆయన ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కమలాపురం నుంచి వైకాపా తరపున రవీంద్రనాథ్ రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. తెదేపాలో కుమ్ములాటలే తనకులాభిస్తాయని ఆయన ధీమాగా ఉన్నారు.
ప్రొద్దుటూరు నియోజకర్గం నుంచి అధికార పార్టీ ఇంకాఅభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, లింగారెడ్డి పోటీ పడుతున్నారు. వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం ఆరంభించిన ఆయన... అధికార తెదేపా నేతల మధ్య ఉన్న విభేదాలే తమకు అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండే కడప నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్ పేరును తెదేపా పరిశీలిస్తోంది. నెల రోజుల కిందటే అష్రఫ్ పార్టీలో చేరటం ప్రతికూల అంశం. కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పేరూ పరిశీలనలో ఉంది. వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ భాషా మరోసారి పోటీ చేయనున్నారు. ఎస్సీ రిజ్వర్డు నియోజకవర్గమైనబద్వేల్లో తెదేపా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సూచించిన వారికే టికెట్ దక్కే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచిన ఎమ్మెల్యే జయరాములు తెదేపా గూటికి చేరారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన విజయ జ్యోతి టికెట్ ఆశిస్తున్నారు. వైకాపా తరఫున వైద్యుడు వెంకట సుబ్బయ్య పేరు పరిశీలిస్తున్నప్పటికీ... అధికార పార్టీ టికెట్ ఖరారు చేసిన తర్వాతే బరిలో నిలిచేది ఎవరో తేలనుంది.
జిల్లాలో సైకిల్ పరుగులు పెట్టిన రాజంపేట స్థానంలో రాజకీయం రసవత్తరంగా ఉంది. కిందటి ఎన్నికల్లో తెదేపా తరపున గెలిచిన ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి ఇటీవలే జగన్ గూటికి చేరారు. ఆయనే వైకాపా అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. ఇక్కడ తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇరువురు నేతలు ప్రచారం మొదలుపెట్టారు. జిల్లాలో ఉన్న మరో ఎస్సీ నియోజకవర్గంకోడూరు నుంచి తెదేపా అభ్యర్థిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మేనల్లుడు నరసింహ ప్రసాద్ పేరును తెదేపా దాదాపుగా ఖరారు చేసింది. వైకాపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పోటీ చేయనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో వైకాపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమవగా... తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెదేపా టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుమారుడు ప్రసాద్ బాబుకు అధిష్ఠానం తితిదే పాలకమండలి సభ్యుడి పదవి ఇచ్చి బుజ్జగించింది.
కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కడప జిల్లా కంచుకోట అయినా... రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో ఆ పార్టీ ఉనికిప్రమాదంలో పడింది. కిందటి ఎన్నికల్లో ఖాతా తెరవని పరిస్థితి. ఈసారి హోదా ఇస్తామనే హామీతో ప్రజామోదం కోసం వెళ్తోంది. ఆశావహులు భారీగానే టికెట్ల కోసం దరఖాస్తుచేసుకున్నారు. ఇక ప్రధాన పార్టీల్లో టికెట్ దక్కే అవకాశం లేని నాయకులు జనసేన వైపు చూస్తున్నారు.
కడప పార్లమెంటు స్థానానికి తెదేపా అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణరెడ్డి పేరు ముఖ్యమంత్రి ఖరారు చేశారు. వైకాపా తరపున అవినాశ్ రెడ్డి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. రాజంపేట పార్లమెంటు స్థానానికి వైకాపా తరఫున మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో భాజపా, తెదేపా పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశండీకే ఆదికేశవులునాయుడు కుమారుడు శ్రీనివాసులు పేరు పరిశీలిస్తోంది. వైకాపా కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార పార్టీపావులు కదపుతుండగా...జిల్లాపై మరోసారి తమదైన ముద్ర వేసేందుకు వైకాపా వ్యూహాలు రచిస్తోంది.
ఇవీ చదవండి