కరోనా వైరస్ నియంత్రణ దృష్ట్యా విధించిన లాక్‌డౌన్‌ను కడప జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలుచేస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని పోలీసుశాఖ విజ్ఞప్తి చేస్తున్నా.... కొందరు పెడచెవిన పెడుతూ రోడ్లపై తిరుగుతున్నారు. ఇష్టారీతిన బయట తిరుగుతున్న వారికి మరింత అవగాహన కల్పించేందుకు.... ఇద్దరు యువకులు నడుం బిగించారు. జాఫర్ అలీఖాన్ అనే విద్యార్థి.. స్నేహితుడితో కలిసి వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. స్పీకర్, మైకు పట్టుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇద్దరూ నడుచుకుంటూ.... మాటలతో పాటు పాటల ద్వారా ప్రజలకు లాక్‌డౌన్ ఆవశ్యకతను వివరిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, పోలీసులకు సహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ప్రచారం వల్ల కొంతవరకైనా ప్రజలకు అవగాహన వస్తుందనే భావనతోనే ఇలా చేస్తున్నామని యువకులు అంటున్నారు.
పోలీసుశాఖ కూడా లఘు చిత్రాల ద్వారా సరికొత్తగా అవగాహన కల్పిస్తోంది. నగరానికి చెందిన లఘు చిత్రాల దర్శకుడు హేమంత్ కుమార్‌తో కలిసి.... ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. లాక్‌డౌన్ ఎందుకు విధించారు, ఆంక్షలను అతిక్రమిస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో.... సవివరంగా అందులో తెలియజేస్తున్నారు.
ఇదీ చదవండి: వలస కూలీల ఆకలి తీర్చిన 'ఈటీవీ భారత్'