కడపజిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూముల పరిశీలన చేస్తున్నారు. దీనికోసం జాయింట్ కలెక్టర్ గౌతమి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు వెల్లటూరు ప్రాంతంలోని భూములను పరిశీలనకు వెళ్లారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన చాలామంది రైతులు... సోలార్ ప్లాంట్‌కు తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. వెల్లటూరు, రెడ్డిపల్లె, కొత్తగిరిపల్లె, నవాస్కాన్ పల్లె గ్రామస్థులు తమ ప్రాంతంలో సోలార్ ప్లాంట్ వద్దంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని అడ్డగించారు. అధికారులు, నాయకులు భూముల వైపు రాకుండా కొందరు గ్రామస్థులు రాళ్లు అడ్డంగా వేశారు. ప్రజలకు సర్దిచెప్పినా వినే పరిస్థితి లేకపోవడంతో... అధికారులు, ఎమ్మెల్యే మ్యాప్ ద్వారా భూములను పరిశీలించి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ ఎలా ఇస్తారు: రఘురామకృష్ణరాజు