కడప జిల్లా...2014 సంవత్సరానికి మందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజన ఆ పార్టీని అతలాకుతలం చేసింది. తిరిగి ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారాలని ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వస్తే... ఏపీకి హోదాపైనే తొలి సంతకం చేస్తామనే నినాదంతోనే ప్రజల ముందుకెళ్తోంది. ఇదే ఉత్సాహంతో భవిష్యత్‌ను పరీక్షించుకునేందుకు నేతలూ పోటీ పడుతున్నారు. కడప జిల్లాలో టికెట్ ఆశావహులు క్యూకడుతున్నారు. ఈ నెల 21 నిర్వహించే ప్రత్యేక హోదా భరోసా యాత్ర విజయవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం కడప జిల్లా కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2పార్లమెంట్ స్థానాలకు దరఖాస్తుల స్వీకరణ పూరైంది. కిందటి ఎన్నికల్లో పోటీకి ముందుకు రాని అభ్యర్థులు... నేడు పోటీకి సై అంటున్నారు. రాజంపేట పార్లమెంట్ స్థానానికి 8 దరఖాస్తులు, కడప లోక్‌సభకు 13 దరఖాస్తులు వచ్చాయి. ఈ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అధిక సంఖ్యలోనే ఆశావహులు ఉన్నారు. రాజంపేటలో అవకాశం ఇవ్వాలని 19 మంది కోరగా, రాయచోటి నుంచి 13 మంది, కడప నుంచి 15 మంది సీటు కోరుతున్నారు. మిగతా నియోజకవర్గాలోనూ 5 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.
పనితీరే ప్రామాణికం...!
కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలవడానికి దరఖాస్తు చేసుకున్న ఆశావహుల వడపోత కార్యక్రమానికి పార్టీ ఓ పరీక్ష పెడుతోంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కో మండలం కేటాయిస్తారు. వీటిల్లో సభ్యత్వ నమోదు ఎక్కువ చేసి... పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేసినవారికే అవకాశ దక్కుతుందని పార్టీ స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి... శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ప్రియాంక గాంధీతో బహిరంగసభలు ఏర్పాటు చేయాలని పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది.