రైల్వే, హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘరానా మోసగాళ్లను కడప ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ల్యాప్టాప్, జిరాక్స్ మిషన్, చరవాణితో పాటు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని.. కడప డీఎస్పీ సునీల్ మీడియా ఎదుట హాజరుపరిచారు.
కడప ఎర్రముక్కపల్లికు చెందిన శివ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ప్రభుత్వంలో పలువురు ఉన్నతాధికారులతో తనకు పరిచయాలున్నాయని.. హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానంటూ పులివెందులకు చెందిన రాజు అనే వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు నగదు తీసుకున్నాడు. అతనికి నియామకపత్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ పత్రాన్ని పరిశీలిస్తే నకిలీదని తేలింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా శివను అరెస్ట్ చేసి అతని నుంచి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను స్వాధీనపరుచుకున్నారు. శివతో పాటు అతనికి సహకరించిన షేక్ షఫీ ఉల్లాను కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: Mother killed baby: విశాఖ మారికవలసలో దారుణం.. మూడేళ్ల బిడ్డను చంపి అంత్యక్రియలు చేసిన తల్లి