Jagan Government Cut Subsidies to BC : నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ప్రతి సభలోనూ గుండెలు బాదుకునే సీఎం జగన్.. వారి గుండెలపైనే దెబ్బకొట్టారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా భూముల కొనుగోలుకు చేసే ఖర్చులో అందే రాయితీని పూర్తిగా ఎత్తేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూముల కొనుగోలుకు చేసే ఖర్చులో వారికి ఇచ్చే రాయితీని జగన్ ప్రభుత్వం ఎత్తేసింది. టీడీపీ ప్రభుత్వం బీసీల కోసం పారిశ్రామిక విధానంలో ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్యాకేజీని సైతం తొలగించింది. దీంతో భూముల కొనుగోలుకు చేసే ఖర్చులో గరిష్ఠంగా 20 లక్షల రాయితీని బీసీలు కోల్పోయారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను పారిశ్రామికరంగం వైపు ఆకర్షించేలా వారికి ప్రాధాన్యత కల్పించడంతో పాటు, ప్రోత్సాహకాలను అందిస్తామని చెబుతూనే వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రాయితీల్లో జగన్ భారీగా కోత పెట్టారు. గత ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీని 2020-23 పారిశ్రామిక విధానంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. కనీసం 2023-27 పారిశ్రామిక విధానంలోనైనా దీన్ని పునరుద్ధరిస్తారనే ఆశతో ఎదురుచూసిన బీసీ పారిశ్రామికవేత్తలకు నిరాశే మిగిలింది.
పారిశ్రామిక రంగంలోకి కొత్తగా రావాలన్న ఆలోచనలో ఉన్న అంకురాలపై దీని ప్రభావం పడింది. పెట్టుబడులు భారీగా పెరగటం మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలవడం సవాల్‌గా మారడంతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారి సంఖ్య ప్రభుత్వ నిర్వాకంతో గణనీయంగా తగ్గింది. బీసీ కార్పొరేషన్ నుంచి ఇచ్చే రుణాలను కూడా అమ్మఒడికి మళ్లించి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
గత ప్రభుత్వం భూముల ధరలో ఇచ్చిన రాయితీని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తొలగించింది. సీఎం సొంత జిల్లాలో కేవలం 8 మంది బీసీలకు మాత్రమే పరిశ్రమలు ఉన్నాయంటే బీసీలను ప్రభుత్వం ఏమేరకు ప్రోత్సహిస్తుందో అర్థమవుతోంది. బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీని టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ప్రకటించింది. బీసీలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2015-20 పారిశ్రామిక విధానంలోభూముల కొనుగోలుకు వెచ్చించే మొత్తంలో 50 శాతం రాయితీ ఇచ్చింది. దీని ప్రకారం పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్‌లలో కొనుగోలు చేసే భూములకు నిర్దేశించిన ధరలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
మహిళా పారిశ్రామికవేత్తలకు భూముల ధరలో మరో 10 శాతం అదనపు రాయితీ ఇచ్చి ప్రోత్సహించింది. దీంతోపాటు స్థిర మూలధన పెట్టుబడిలో 35 శాతం రిబేటు ఇచ్చింది. ఇతర ప్రోత్సాహకాలను యథావిధిగా వర్తింప జేసింది. వాటివల్ల బీసీ వరాలు చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం తగ్గడంతో ఊరట లభించింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ అవకాశాలన్నింటికీ గండికొట్టడంతో బీసీలు కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు రావడం లేదు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిన్నచిన్న పరిశ్రమలు పెట్టుకుని వ్యాపార, పరిశ్రమ రంగాల్లో రాణించాలంటే బ్యాంకులు, అధికారులు కొర్రీలతో నిరాశ చెందాల్సిన పరిస్థితి వచ్చిందని ఔత్సాహిక బీసీ పారిశ్రామికవేత్తలు అంటున్నారు. కనీసం రాయితీలన్నా ఇస్తే కొంత వరకు మేలు జరుగుతుందని అంటున్నారు.