Husband and Wife Committed Suicide: వైఎస్సార్ జిల్లాలో కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంధువులతో ఎంతో సంతోషంగా గడపాల్సిన దసరా పండుగ సమయంలో ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు మండలంలోని రుకవారిపల్లెకు చెందిన రవిశంకర్, సరస్వతికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవిశంకర్ కడప వైవీ స్ట్రీట్‌లోని ఓ బంగారు దుకాణంలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమారుడికి ఇటీవల వివాహమైంది. చిన్న కుమార్తె అమెరికాలో చదువుతోంది. అయితే కొద్దిరోజుల నుంచి కుటుంబంలో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.
ఈ మేరకు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సరస్వతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భార్య మరణవార్తను తెలుసుకున్న భర్త రవిశంకర్ తీవ్ర మనస్థాపానికి గురై తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.
Farmer Commits Suicide Due to Debt Problem: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..
అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి.. ఆపద సమయంలో ప్రాణాలు రక్షించాల్సిన 108 వాహనం ఓ వ్యక్తిని బలంగా ఢీ కొనడంతో అతడు మృతి చెందాడు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళగిరి టిడ్కో నివాస ప్రాంతంలో ఓ వ్యక్తి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108కి కాల్ చేశారు. అయితే అతడిని హాస్పిటల్‌కి తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ వెనకకు తిప్పుతున్న క్రమంలో ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో హుటాహుటిన అతడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనలో అంబులెన్స్ వాహన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.. బాపట్ల జిల్లా మార్టూరు జాతీయరహదారిపై వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణిస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి స్వగ్రామం వైజాగ్ వెళుతుండగా.. బెంగళూరు నుంచి విజయవాడకు కొత్తిమీర లోడ్‌తో గుంటూరు వైపు వెళుతున్న లారీ ముందు వెళుతున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జుకాగా.. బస్సు వెనుక భాగంగా దెబ్బతింది. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది తాళ్ల సహాయంతో మినీ లారీని పక్కకు లాగారు.
బలంగా ఢీకొన్న రెండు బైకులు.. అనకాపల్లి జిల్లా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాడుగుల మండలం ఎం.కోడూరులో శనివారం రాత్రి ఎదురెదురుగా రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాడుగులకు చెందిన కిరణ్, జయరాం, కోటేశ్వరరావు, సలేమాన్.. తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కిరణ్, కోటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై మాడుగుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు.. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వరండాలో ఉంచిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న కొండయ్య పామూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇంటి సమీపంలో పడి ఉన్న పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
స్వల్ప వివాదం.. ఆటో డ్రైవర్ మృతి.. స్పల్ప వివాదం కారణంగా ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన కాకినాడ గ్రామీణ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పిఠాపురంకు చెందిన సయ్యద్ అహ్మద్ ద్విచక్ర వాహనంపై భార్యతో కలిసి కాకినాడ వెళ్తున్నాడు. నాగమల్లితోట కూడలిలో వీరిని ఓ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో అహ్మద్ భార్య కింద పడిపోయింది. ఆటో ఆపకుండా వేగంగా వెళ్ళిపోయింది. అహ్మద్ ఆటోను అడ్డగించాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అహ్మద్.. ఆటో డ్రైవర్ రాజేంద్రప్రసాద్ చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ తలకు గాయమైందని చికిత్స మేరకు కాకినాడు జీజీహెచ్‌కు తరలించగా.. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Boy Committed Suicide by Hanging స్థానికులను కన్నీళ్లు పెట్టించిన బాలుడు ఆత్మహత్య..!