Happy Sankranti to all Telugu Peoples: ''సంక్రాంతి పండుగ అంటే.. పల్లెల పండుగ, రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు.
భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు సంక్రాంతి ప్రత్యేకతలన్నారు. గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆభిలషిస్తున్నట్లు తెలిపారు. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని ఆయన కోరారు. పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్ళలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
విశాఖ వైసీపీ కార్యాలయంలో..
విశాఖ వైసీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరిగాయి. రంగు రంగుల రంగవల్లికలు తీర్చిదిద్దారు. పార్టీ శ్రేణులు బోగీమంటలు వేసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. పట్టుచీరలు, పట్టు పరికిణీలతో సంప్రదాయబద్దంగా వచ్చిన మహిళా నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. సంక్రాంతి గీతాలకు అనుగుణంగా నృత్యాలతో అందరిని అలరించారు.
ఇవీ చదవండి