బ్యాంకులో రుణం తీసుకుని మోసం చేశారనే ఫిర్యాదుతో కడప జిల్లా ప్రొద్దుటూరులోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 55 మందిపై చీటింగ్ కేసు నమోదైంది. వడ్లబస్తాలపై రెండు సార్లు రుణం తీసుకుని .. రెండు బ్యాంకులకు టోకరా వేశారు.
జిల్లాలోని చాపాడు మండలంలోని 52 మంది రైతులు పల్లవోలు గ్రామానికి చెందిన మార్తల నరసింహారెడ్డికి సంబంధించిన శ్రీ తరణి కృష్ణ అగ్రికల్చర్ స్టోరేజ్‌లో వేల సంఖ్యలో వడ్ల బస్తాలు ఉంచారు. ఎన్‌బీహెచ్‌సీ మేనేజర్, సూపర్వైజర్లతో మాట్లాడిన నరసింహారెడ్డి... కొద్ది రోజుల తరువాత సూపర్వైజర్లతో కలిసి ఎస్‌బీఐ, ఏడీబీ బ్రాంచ్‌లో 6 కోట్ల రూపాయలు రుణాన్ని వారందరూ తీసుకున్నారు. బస్తాలన్నింటికి ఆ బ్రాంచ్ ట్యాగులు వేశారు. కొంత కాలానికి తీసుకున్న రుణం చెల్లించకుండా.. డబ్బులు చెల్లించినట్లు ఫీల్డ్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ చేసి బస్తాలు తిరిగి తీసుకునేందుకు.. అందుకు సంబంధించిన రశీదులు తయారు చేసుకున్నారు. వాటిని ముంబైలోని ఎన్‌బీహెచ్‌సీ మెయిన్ బ్రాంచ్‌లో చూపించడంతో అధికారులు రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. మళ్లీ అవే బస్తాలు చూపించి ప్రొద్దుటూరులోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కార్పొరేషన్‌లో నరసింహారెడ్డి, రైతులు మళ్లీ కోట్ల రూపాయల రుణం తీసుకుని బస్తాలకు ఆ బ్యాంకు ట్యాగులు వేశారు.
కొంత కాలం తరువాత ఎస్‌బీఐ, ఏడీబీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ తనిఖీకి వెళ్లడంతో వారు చేసిన అక్రమాలు బయటపడ్డాయి. ఎస్‌బీఐ, ఏడీబీ ట్యాగులు ఉండాల్సిన బస్తాలపై ఓరియంటల్ ట్యాగులు చూసిన చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ మోసం జరిగినట్లు గుర్తించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు రుణం తీసుకున్న 52 మంది రైతులతో పాటు మార్తల నరసింహారెడ్డి, ఎన్‌బీహెచ్‌సీ మేనేజర్, సూపర్వైజర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.
ఇదీచూడండి. నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు