కరవు పరిస్థితులు నెలకొన్న కడప జిల్లాలో ఉపాధి కోసం సొంత ఊళ్లు వదిలి గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడే సంఘటనలు ఎన్నో దర్శనమిస్తున్నాయి. గత కొంత కాలంగా జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలా వెళ్లిన వారిలో ఆర్థికంగా చితికిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి కష్టమే సయ్యద్ అలీ అనే కుటుంబాని వెంటాడుతోంది. కువైట్ వెళ్లిన సయ్యద్ తిరిగి వస్తాడా.? అసలు చూస్తామా అనే ఆవేదనలో ఉంది అతని కుటుంబం.
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రెడ్డివారి పల్లెకు చెందిన సయ్యద్ అలీ ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లారు. ఎడారిలో జీవాలను మేపుతూ... వచ్చిన వేతనాన్ని ఇంటికి పంపి తల్లీ తండ్రి, భార్య పిల్లలను పోషించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 2016 జూన్ 10 తర్వాత సయ్యద్ అలీ నుంచి ఇంటికి ఫోన్ రాలేదు. ఆయన ఎక్కడున్నాడు..ఎలా ఉన్నాడు తెలియడం లేదు. నాటి నుంచి ఆ పేద కుటంబం తల్లిడిల్లిపోతోంది.
గల్ఫ్‌కు వెళ్లిన కొడుకుపై బెంగ పెట్టుకున్న తల్లి ఇటీవలి మృతి చెందింది. ఇక సయ్యద్ అలీ భార్య షేక్ రహమత్ ఉన్నిసా భర్త కోసం ఎదురుచూస్తూ నిత్యం రోధిస్తోంది. కుటుంబ పోషణ భారం ఆమె పైనే పడింది. కూలీకెళ్తేగానే పూటగడవని పరిస్థితి. ఓ వైపు ఇంటి పెద్దగా బతుకుబండి లాగుతూనే... బరువెక్కిన హృదయంతో భర్త కోసం ఎదురుచూస్తోందామె.
అలీ ఇంటిని తెలంగాణకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సందర్శించిది. ఎలాగైనా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సయ్యద్ అలీని కుటుంబ సభ్యుల దరి చేరుస్తామని భరోసా ఇచ్చింది.