కడప పాత రిమ్స్‌లోని ప్రాంతీయ వైద్య, ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో ఎప్పుడు బదిలీలు నిర్వహించినా వివాదాస్పదం అవుతోంది. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖలోని ఉద్యోగులకు.. కడపలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే నర్సులు, స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సుల కోసం కౌన్సెలింగ్ జరిగింది. రీజనల్ డైరెక్టర్ వీణాకుమారి ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు.
గతంలో మ్యూచువల్ ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేశారు. ఈసారి అన్ని రకాల కేటగిరీలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. స్పౌజు విభాగం కింద భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పనిచేసేందుకు అవకాశం ఉన్నా... తమ విషయంలో వాటిని పరిగణించటం లేదని స్టాఫ్ నర్సులు ఆవేదన చెందారు. వీటితో పాటు ఎన్జీవో సంఘాలు, యూనియన్ నాయకుల నుంచి సిఫారసు లేఖలు పొందిన వారిని మాత్రం ఏళ్ల తరబడి ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్నా.. బదిలీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జాబితాలో చాలామంది 20 నుంచి 26 ఏళ్ల పాటు ఒకేచోట పనిచేస్తున్నట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ నిర్వహించకుండా స్టాఫ్ నర్సులు బదిలీలు చేపట్టడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రీజనల్ డైరెక్టర్ వీణాకుమారి మాత్రం బదిలీలు పారదర్శకంగా జరగుతున్నాయన్నారు. గురువారమూ ప్రక్రియ కొనసాగనుంది.