కడప జిల్లా వేంపల్లె మండల పరిధిలోని టి.వెలమవారిపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కందుల కుటుంబ సభ్యులు చెప్పిన అభ్యర్థులే అక్కడ సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ దఫా... వైకాపాలోని రెండు వర్గాల మధ్య కుదరిని సఖ్యత వల్ల ఎన్నికలు అనివార్యమయ్యాయి.
గత నెలలో జరిగిన నాల్గవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేంపల్లె మండలంలోని టి.వెలమవారిపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించిన నామినేషన్లు ఇరువర్గాల అభ్యర్థులు ఉపసంహరణ చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. తిరిగి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నిక అనివార్యమైంది. వైకాపా పార్టీలోనే కందుల కుటుంబ వర్గీయులు, మరో వైకాపా నేత వర్గీయులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. టి.వెలమవారిపల్లె సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసేందుకు ఇరువర్గాలు మధ్య సయోధ్య కుదరకపోవడంతో పోటి తప్పలేదు.
గత బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆఖరి కావడంతో ఇరువర్గాలు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. చివరగా.. సర్పంచ్ పదవికి వైకాపా మద్దతుతో కందుల కుటుంబం తరఫున రవణమ్మ పోటిలో నిలవగా.. వైకాపాలోనే మరో వర్గానికి చెందిన లతీఫా సైతం నామినేషన్ వేశారు. టి. వెలమవారిపల్లెలో 1647 ఓట్లు ఉండగా వాటిలో పురుషుల ఓట్లు 827, మహిళల ఓట్లు 825 ఉన్నాయి. ఈ స్థానానికి సోమవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. పోలింగ్ పూర్తయింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 35 ఏళ్ల తర్వాత ఓటు వేసేందుకు గ్రామస్థులు బారులు తీరారు.
ఇదీ చదవండి: