ప్రజాసంకల్పయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప జిల్లా కేంద్రంలో వైకాపా ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. మాసీమ సర్కిల్ నుంచి ఏడురోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మూడు వేల కిలోమీటర్లుపైగా జగన్ పాదయాత్ర నిర్వహించి అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ అధికారంలోకి వచ్చాక 90% నెరవేర్చారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తెలిపారు. కరోనా నిబంధనలను లెక్క చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సభలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఎన్నికలకు వెళ్లడానికి వైకాపా కలలో కూడా భయపడదు'