కరివేపాకు.. రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు నెలల క్రితం కిలో రూ.40 ఉన్న ధర నేడు ఒక్క రూపాయైనా పలకడంలేదు. కరోనా కారణంగా హోటళ్లు, మెస్‌లు, విద్యార్థుల హాస్టళ్లు మూతపడటంతో గిరాకీ తగ్గిపోయింది. ఎకరాకు రూ.60 వేలు ఖర్చు చేసిన రైతన్న.. ప్రస్తుతం కొనేవారు లేకపోవడంతో పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొంతమంది దున్నేస్తుండగా, మరికొందరు తగలబెట్టేస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ కరివేపాకు రైతులది ఇదే పరిస్థితి.
రాష్ట్రంలో గుంటూరు జిల్లా తర్వాత కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడులో అధికంగా కరివేపాకు సాగు చేస్తారు. ఈ గ్రామంలో 500-600 ఎకరాల్లో కరివేపాకు తోటలు సాగులో ఉన్నాయి. గుంటూరు జిల్లా పెద్దవడ్లపూడిలో కిలో విత్తనం రూ.270 నుంచి రూ.350 వరకు చెల్లించి తీసుకొచ్చారు. మూడేళ్లుగా పంట వేయగా కరోనా ప్రభావం ఎగుమతులపై తీవ్రంగా పడింది. ఎకరాకు కనీసం రూ.60-70 వేల వరకు ఖర్చు ఉంటుందని చెబుతున్నారు. రెండోదశ కరోనా ముందు కిలో కరివేపాకు రూ.40 పలికింది. లాక్‌డౌన్ వల్ల ఎగుమతులు ఆగిపోయాయి. పంట కోతకు వచ్చే సమయానికి ధర లేక పొలాల్లోనే వదిలేశారు. కొందరు వ్యాపారులు ట్రాక్టర్లు, లారీల్లో ఉచితంగా తరలించుకుపోతున్నారు. హైదరాబాద్‌లో కిలో రూ.35-40కి అమ్ముతున్నారు.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
మార్కెట్‌లో ధర బాగా ఉన్నప్పుడు ముంబయి, చెన్నై, కోయంబత్తూరు, అరక్కోణం, హైదరాబాద్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు కరివేపాకును ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే కరివేపాకును వదిలేశారు. ఉద్యానశాఖ అధికారులు గ్రామంలో పర్యటించి నష్ట తీవ్రతను లెక్క కట్టి బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పంట కోసం నగల తాకట్టు
బంగారు నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి కరివేపాకు సాగు చేశాను. పంట చేతికందిన తర్వాత ధర పడిపోయింది. కిలో రూ.15 ఉన్నా అసలు వస్తుంది. ప్రస్తుతం రూపాయికి కూడా కొనేవారు లేరు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. - నార్పల సుబ్బారెడ్డి, కరివేపాకు రైతు, ఎస్.ఉప్పలపాడు
ఇదీ చూడండి.