Distribution of gifts by Ramachandra Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టిన పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి.. ఇప్పుడు ఉపాధ్యాయులకు కానుకల్ని పంచే పనిని వేగవంతం చేశారని ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థ నడుపుతున్న ఆయనపై.. ఇప్పటికే బోగస్ ఓట్లు నమోదు చేయించారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై 24 గంటలు కాకముందే శుక్రవారం జిల్లా వ్యాప్తంగా టిఫిన్ బాక్సులు పంపిణీ మొదలు పెట్టగా.. సీపీఐ, విద్యార్థి సంఘాల నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయినా శనివారం తాయిలాల పంపిణీ యత్నాలు కొనసాగాయి. కడప శివారు రామరాజుపల్లిలోని నాగార్జున పాఠశాలలో భారీగా బాక్సులను సీపీఐ నాయకులు గుర్తించారు. వాహనాల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాటిపైన పోలీసులకు సమాచారం అందించారు.
నాగార్జున పాఠశాలలో పెద్ద సంఖ్యలో గిఫ్ట్ క్యారియర్ బాక్సులు కనిపిస్తున్నా.. అధికార పార్టీ నాయకులకు చెందినవి కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకునేందుకు వెనుకంజ వేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. దాంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య విద్యార్థులకు ఇచ్చేందుకు బాక్సులు తెప్పించినట్లు పాఠశాల యాజమాన్యం చెప్పింది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో బాక్సుల్ని స్వాధీనం చేసుకోని పోలీసులు.. తప్పనిసరి పరిస్థితుల్లో గిఫ్ట్ బాక్సులున్న గదికి మరోతాళం వేసి వెళ్లిపోయారు. అయితే ఎట్టకేలకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నాగార్జున పాఠశాల కరస్పాండెంట్ శివశంకర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: