Cooperative Sugar Sector: సొంత జిల్లాలోని చెన్నూరు చక్కెర పరిశ్రమను నెలరోజుల్లోనే తెరిపిస్తామని చెప్పిన సీఎం జగన్.. మూడున్నర సంవత్సరాలు గడిచినా దాన్ని తెరవలేదు. పైగా వాటి అప్పగింతకు ప్రణాళికలు సిద్ధం చేశారు. చెన్నూరు పరిశ్రమకు చెందిన 59 కోట్ల రూపాయల విలువైన 237 ఎకరాల భూమిని ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు పేరుతో.. తక్కువ ధరకే తమవారికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యోగులకు జీతాల బకాయిల సొమ్మును విడుదల చేశారు. శాశ్వతంగా మూసేస్తున్న విషయాన్ని చెప్పకుండా.. జీతాల బకాయిలివ్వడమే పెద్ద శుభవార్తగా చెప్పారు. జగన్ చెప్పే విశ్వసనీయత అంటే ఇదేనా? సొంత జిల్లాలో పరిశ్రమ పునరుద్ధరణకు 34 కోట్లు రూపాయలు ఇవ్వలేని ఆయన.. ఇక రాష్ట్రంలో సహకార రంగాన్ని ఉద్ధరిస్తామంటే జనం నమ్మాలా?
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రులు గౌతమ్‌రెడ్డి, కన్నబాబు, బొత్స సత్యనారాయణలతో ఏర్పాటు చేసిన ఉప సంఘం సహకార చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ మాట పక్కన పెట్టి.. వాటి శాశ్వత విరామానికి దారి చూపించింది. ఆరు పరిశ్రమల పరిధిలో వీఆర్‌ఎస్ అమలుచేసి జీతాల బకాయిల్ని చెల్లించాలని సూచించింది. వాటిలో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
6 చక్కెర పరిశ్రమల పరిధిలో.. సుమారు 2వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన భూములు, భవనాలు, యంత్ర పరికరాలను తక్కువ ధరకే ఆహారశుద్ధి పరిశ్రమల పేరుతో ప్రైవేటుకు అప్పగించబోతున్నారు. ఒక్కో ఫ్యాక్టరీకి 60కోట్ల రూపాయల నుంచి 100కోట్ల రూపాయల చొప్పున.. సుమారు 400 కోట్లు రూపాయలు ఇస్తే మూతపడిన 6 చక్కెర పరిశ్రమలకు పూర్వ వైభవం వస్తుందని, చెరకు సాగు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినా.. ఈ సొమ్ములు ఇవ్వడానికీ పాలకులకు మనసు రావడంలేదు.
ప్రభుత్వం అప్పగింతకు ప్రతిపాదించిన ఆరు చక్కెర పరిశ్రమల రోజువారీ క్రషింగ్ సామర్థ్యం 9వేల 100 టన్నులు. భూముల విలువ 14వందల 50 కోట్లు రూపాయలు. యంత్రపరికరాలు, భవనాలు కలిపి 2వేల కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంచనా. అప్పులు 550 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. వీటి పరిధిలో 16వందల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గతేడాది ఏప్రిల్ వరకు గడువుగా నిర్ణయించి జీతభత్యాల బకాయిల కింద 105 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చెన్నూరు పరిశ్రమల బకాయిలే చెల్లించారు. మిగిలిన వారికి ఇంకా ఇవ్వలేదు.
తిరుపతి జిల్లా గాజులమాండ్యంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమలో... 10వేల 500 మంది రైతులు వాటాదారులు. తిరుపతికి సమీపంలో 165 ఎకరాలున్నాయి. వీటి విలువ 412 కోట్ల రూపాయలు పైమాటే. అప్పులు సుమారు 70కోట్లు రూపాయలు మాత్రమే. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంలోని సహకార చక్కెర పరిశ్రమ పరిధిలో 10వేల మంది రైతులున్నారు. నెల్లూరులో 252 కోట్లు రూపాయల విలువైన 126 ఎకరాలు ఉన్నాయి. YSR జిల్లా చెన్నూరు చక్కెర పరిశ్రమలో 10వేల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. 59 కోట్ల రూపాయలకుపైగా విలువైన 237 ఎకరాల భూమి ఉంది.
చిత్తూరు సహకార చక్కెర కర్మాగార పరిధిలో 15వేల మంది వాటాదారులు ఉన్నారు. చిత్తూరు శివార్లలో 480 కోట్ల రూపాయలు విలువైన సుమారు 80 ఎకరాలు ఈ కర్మాగారానికి ఉన్నాయి. అనకాపల్లి చక్కెర పరిశ్రమ పరిధిలో 13వేల 400 మంది రైతులున్నారు. ఈ సంస్థకు 200 కోట్లు రూపాయల విలువైన భూములు ఉన్నాయి.
బాపట్ల జిల్లా వేమూరులోని నన్నపనేని వెంకటరావు సహకార చక్కెర కర్మాగారంలో 11వేల మంది రైతుల డిపాజిట్లు 2కోట్ల రూపాయలకుపైగా ఉన్నాయి. సుమారు 77 ఎకరాల భూముల విలువ 39 కోట్ల రూపాయలకుపైనే ఉంటుంది. వేతన బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చినా అవి ఇంకా అందకపోవడంతో..కార్మికులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే ఉత్తరాంధ్రలోని నాలుగు పరిశ్రమలకు విరామం ప్రకటించారు. 2019-20లో అనకాపల్లి, 2021-22లో ఏటికొప్పాక, పాయకరావుపేటలోని తాండవకు తాళాలేశారు. విజయనగరం జిల్లాలోని విజయరామగజపతి పరిశ్రమ కూడా 2019-20లో మూతపడింది. ప్రస్తుతం చోడవరం మండలంలోని గోవాడలోని చక్కెర కర్మాగారంలోనే ఉత్పత్తి జరుగుతోంది.