పెట్రో, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం ద్వారా సామాన్యుల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. వంట గ్యాస్ ధరలు నెలలో 20 సార్లు, పెట్రో ధరలు 18 సార్లు పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. పెట్రో ధరల పెంపుపై ఆయన కడపలో మాట్లాడారు. ఇంత దారుణంగా ధరలు పెంచితే సామాన్యులు ఏ విధంగా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం వంటగ్యాస్పై పన్ను తగ్గించే అవకాశం ఉన్నా ఆ పని చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయన్న తులసిరెడ్డి... ప్రజల్లో తిరుగుబాటు వస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భయం ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగలేదని తెలిపారు.
ఇదీ చదవండి: 'బడుగులకు అందనంత ఎత్తులో ఉపాధి అవకాశాలు'