తన భర్త వైఎస్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు తాను రాసిన పుస్తకంలో ఉన్నాయని... ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు నివాళుల అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 9 గంటలకు సీఎం జగన్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం విజయమ్మ రాసిన "నాలో.. నాతో... వై.ఎస్.ఆర్." అనే పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు.
అనంతరం పక్కనే ఉన్న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 190 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ట్రిపుల్ ఐటీలో నూతనంగా నిర్మించిన అకడమిక్ కాంప్లెక్స్ మొదటి దశను ప్రారంభించారు. 3 మెగావాట్లతో నిర్మించిన సోలార్ ప్లాంట్ ను ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ సర్కిల్లో వై.ఎస్.ఆర్. కాంస్య విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. రైతు దినోత్సవం సందర్భంగా పలువురు రైతులతో సీఎం జగన్ కలిసి ముచ్చటించారు.
ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ కు రెండు గంటల ముందే ముగిసింది. 12.45 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలు దేరాల్సి ఉండగా... 10.30 గంటలకే బయలు దేరి వెళ్లారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం వెళ్లారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.
'నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.' అని జగన్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: రైతు దినోత్సవం...పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం