శాంతి, భద్రతల విభాగం రాష్ట్ర అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రత్యేకించి కడపలో మకాం వేశారు. నాలుగు రోజుల కిందటే కడపకు వచ్చిన ఆయన శాంతి భద్రతలపై కడప, కర్నూలు ఎస్పీలతో సమీక్ష నిర్వహించి... పులివెందులలో వివేకా హత్యకు గురైన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈనెల 15న వివేకా హత్య జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి ముందుగా వెళ్లిన వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు. రక్తపు మరకలు తుడిచేసి సాక్ష్యాధారాలు లేకుండా చేశారనే కారణాలతో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో సిట్ అధికారులు ఇంతవరకు అధికారికంగా నిందితులు ఎవరనేది బయట పెట్టలేదు. వై.ఎస్.వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి, హైకోర్టుకు కూడా వెళ్లారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ప్రతిపక్ష నేత జగన్, వివేకా భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో వేసిన పిటిషన్ల విచారణ గురువారానికి వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో కేసును కొలిక్కి తీసుకురావడం ఎలా.... అనే దానిపై సిట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.హత్య చేసిందెవరనేది దానికి ఆధారాలు ఇంకా లభించలేదు. అయితే ముందుగా సాక్ష్యాలు తారుమారు చేసిన వారిపై కేసులు పెట్టాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో వై.ఎస్.కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఇదివరకే ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..