TDP Chief Chandrababu Visited Gandikota Reservoir: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేయలేని జగన్.. కొత్త ప్రాజెక్ట్స్ అంటూ దోపిడీకి తెరలేపాడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పులివెందులకు నీళ్లంటూ 3వేల 556 కోట్లతో మొదలుపెట్టిన గండిపేట- చిత్రావతి, గండికోట- పైడిపాలెం ప్రాజెక్టులు అటకెక్కాయని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు రెండోరోజు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు. కొండాపురంలోని గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద ఆగి ఉన్న పనులను, కొండలపైకి నడుచుకుంటూ వచ్చి పరిశీలించారు.
ప్రాజెక్టు సమీపంలోనే ఆయన కడప జిల్లా జలవనరుల ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పులివెందుల చక్రాయపేట నుంచి కదిరి మీదుగా తంబల్లపల్లికి నీటి తరలింపు పేరున మంత్రి పెద్దిరెడ్డికి రూ.5వేల 036 కోట్లతో పనులు మంజూరు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూనే.. పెద్దిరెడ్డికి మాత్రం 600 కోట్ల బిల్స్‌ని క్లియర్ చేశాడని ఆక్షేపించారు.10 శాతం పెండింగ్ ఉన్న హంద్రీనీవా కాలువ పనులు పూర్తిచేయకుండా కొత్త కాలువలు తవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఎవరికి పేరు వస్తుందో అని భావించిన సీఎం.. అన్ని పెండింగ్ ప్రాజెక్టులను అటకెక్కించాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ఉన్న ప్రాజెక్టులు రద్దు చేసి.. 23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో జగన్ డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఒక్కటీ పూర్తి చేయలేదని విమర్శించారు. నెలకోసారి దిల్లీ వెళ్లే జగన్.. ఈ ప్రాజెక్టుపై KRMB, NGT, CWC నుంచి క్లియరెన్సులు తేలేదని ఆరోపించారు. రివర్స్ నిర్ణయాలతో సాగునీటి రంగాన్ని రివర్స్ చేశాడని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తూనే పులివెందులకు నీరు ఇస్తానని.. గండికోట దగ్గర లిఫ్ట్ ప్రాజెక్టును ప్రతిపాదించాడన్నారు. 6 కోట్లతో గండికోట వద్ద కొత్త లిఫ్ట్ పనులకు ఉత్తర్వులు ఇచ్చాడు.. కానీ, 10 శాతం పనులు కూడా జరగలేదని దుయ్యబట్టారు.
Chandrababu Comments on Telugu Ganga Project: తెలుగు గంగ ప్రాజెక్టు ఆయకట్టు పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు. లైనింగ్ పనులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నీటి సామర్థ్యం పెంచి తెలుగుగంగకు తరలిస్తానన్న హామీని జగన్మోహన్ రెడ్డి విస్మరించాడని ఆక్షేపించారు. గాలేరు- నగరి సుజల స్రవంతి జూన్ 2020 కల్లా పూర్తి చేస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. గండికోట నిర్వాసితులకు పరిహారం అందక రేకుల షెడ్లలో మగ్గుతున్నారని మండిపడ్డారు. పరిహారం చెల్లింపులో 300 మందిని అనర్హులుగా చేర్చారన్నారు. నష్ట పరిహారం కింద 10 లక్షలు, పునరావాసం కింద 7 లక్షలు, సెంట్ల భూమి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రిజర్వాయరుని పూర్తి సామర్ధ్యంతో నింపడానికి నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని మండిపడ్డారు.
పోలవరం పనులకు నాడు గిన్నిస్ రికార్డులు.. నేడు సర్వత్రా విమర్శలు..: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు 665 కోట్లతో పాటు 128కోట్లతో రహదారిని నిర్మించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రివర్స్ నిర్ణయాలతో కడప జిల్లాలో 14 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ అయ్యాయని మండిపడ్డారు. గండికోట-చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఫేజ్ 2 పేరుతో 10 శాతం పనులు కూడా జరగలేదని ధ్వజమెత్తారు. 27 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చెయ్యలేదన్నారు. అవుకు టన్నెల్ మిగిలిన పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. అవుకు ఎడమ సొరంగం 2020 నాటికి పూర్తి చేస్తానన్న జగన్ హామీ నేటికీ నెరవేరలేదని దుయ్యబట్టారు. వైసీపీ ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య ప్రాజెక్టు వరద నీటికి 62 మంది మృతి చెందారని.. 6,000 కోట్ల నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగస్టు 2వ తేదీ వచ్చినా శ్రీశైలం మోటార్లు ఇంకా ఆన్ కాలేదన్న చంద్రబాబు.. పోలవరం పూర్తి చేసి ఆ నీటిని బనకచర్లకు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదని స్పష్టం చేశారు. పోలవరం పనులకు నాడు గిన్నిస్ రికార్డులు వస్తే నేడు అంతా విమర్శలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులు వరద ముంపునకు గురైతే కనీసం తిండి కూడా పెట్టట్లేదని దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితులు వలసపోయే దుస్థితి నెలకొందని వాపోయారు. అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Chandrababu Tour in Jammalamadugu: అంతకుముందు జమ్మలమడుగు నుంచి రోడ్ షో ద్వారా బయలుదేరిన చంద్రబాబు... అధికార పార్టీ ఎమ్మెల్యే పనితీరును ఎండగట్టారు. వెనకబడిన వర్గాలు ఎక్కువగా ఉండే జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని స్పష్టం చేశారు. దోచుకోవాలన్న ఆరాటం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదని దుయ్యబట్టారు. జమ్మలమడుగులో ఒక్క ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరాకైనా జగన్‌మోహన్‌రెడ్డి నీరిచ్చారా అని చంద్రబాబు నిలదీశారు. గండికోట రిజర్వాయర్ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం భారీ వాహన ర్యాలీతో చంద్రబాబు పులివెందులకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో జగన్‌మోహన్‌రెడ్డి స్వగ్రామం బలపనూరు వద్ద చీనీ తోట రైతులు చంద్రబాబుకు గజమాలతో ఘనస్వాగతం పలికారు.