కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో ఎక్కడ భూవివాదాలు జరిగినా, కుటుంబ కలహాలు తలెత్తినా, స్థిరాస్తి గొడవలు, ఆస్తుల తగాదాలు పొడచూపినా బాధితులు వివేకా ఇంటి తలపుతట్టేవారు. తమకు న్యాయం చేస్తారనే భరోసాతో చాలామంది సన్నిహితులు, ఆత్మీయులు, పార్టీ కార్యకర్తలు వివేకాను ఆశ్రయించేవారు. ఆయన ఇరువురికి సర్ధి చెప్పి సెటిల్మెంట్లు చేసేవారని పులివెందులలో ప్రచారంలో ఉంది. ఇలాంటి పంచాయితీ వ్యవహారంలో గిట్టని వారు ఏమైనా కుట్ర చేశారా అనే కోణంలో సీబీఐ ఆరాతీస్తోంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. వివేకా హత్య జరగడానికి ముందు పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నా కుటుంబ పంచాయితీ వివేకా ముందుకు వచ్చినట్లు సమాచారం. మున్నా వివాహ మాడిన ముగ్గురు భార్యల మధ్య వివాదం తలెత్తడంతో పంచాయితీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మున్నా అకౌంట్లోకి ఎంత డబ్బు ఎలా వచ్చింది..?
పులివెందుల ఆర్టీసీ బస్టాండు సమీపంలోని చెప్పుల దుకాణం సరిగ్గా నడవకపోవడం వల్ల అప్పులు చేసిన మున్నా... మూడు నెలల కిందట పులివెందుల వదలి కదిరి చేరాడు. అయితే అతనికి సంబంధించి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని సీబీఐ అధికారులు గుర్తించారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయంపైనే గురువారం మున్నాను కడపలో సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.
కడప జైలులోని అతిథి గృహంలో మున్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేశారు. అతని కుటుంబసభ్యులను కూడా ప్రశ్నించారు. బ్యాంకులో అంత డబ్బు ఎందుకు దాచుకున్నావు, ఎలా సంపాదించావు, అని ప్రశ్నించినట్లు సమాచారం. లేదంటే ఎవరైనా డబ్బు ఇచ్చారా అనే కోణంలో సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు మున్నా సరైనా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. నాలుగు రోజుల నుంచి వరసగా సీబీఐ అధికారులు మున్నాను కడపకు పిలిచి విచారణ చేస్తున్నారు.
చీకట్లో వివేకా ఇంటి రహదారులు పరిశీలన
వివేకా ఇంట్లో పనిచేసే ట్యాంకర్ బాషాను సీబీఐ అధికారులు విచారించారు. పాలడైరీలో డ్రైవర్గా పనిచేసే ట్యాంకర్ బాషా... అనంతరం వివేకా ఇంట్లో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. హత్య జరిగిన సమయంలో ఏదైనా సమాచారం ట్యాంకర్ బాషాకు తెలిసిందా..? అనే కోణంలో గురువారం రాత్రి మరోమారు వివేకా ఇంటిని సీబీఐ అధికారులు ట్యాంకర్ బాషాను తీసుకెళ్లి పరిశీలించారు. అనంతరం చీకట్లోనే వివేకా ఇంటి నుంచి పులివెందుల పట్టణానికి కిలోమీటరు దూరం వరకు రహదారులను పరిశీలిస్తూ ట్యాంకర్ బాషాను తీసుకెళ్లారు.
కడప జైలు అతిథి గృహంలో మున్నాతో మరో ఆరుగురిని కూడా విచారించారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా విచారణకు హాజరయ్యారు. స్థిరాస్తి వ్యాపారంలో వివేకా పంచాయితీలు చేసిన సందర్భాలపై సీబీఐ అధికారులకు ఉన్న అనుమానులను నివృత్తి చేసుకోవడానికి ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులను విచారణకు పిలిచారు. ఇద్దరు మహిళలు కూడా విచారణకు హాజరయ్యారు. ఓ హిజ్రా కూడా సీబీఐ విచారణకు హాజరైంది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి సమయంలో హిజ్రా వివేకా ఇంటి పరిసరాల్లో కనిపించినట్లు సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. ఫలితంగానే హిజ్రాకు ఏమైనా సమాచారం తెలిసి ఉంటుందా అనే కోణంలో ప్రశ్నించడానికి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
రీపిటిషన్ లేక పై కోర్టుకు..!
వివేకా హత్య కేసులో ఆధారాలు తీసుకోవడానికి మరోమారు పులివెందుల కోర్టుకు వెళ్లిన సీబీఐ అధికారులు న్యాయవాదులతో మాట్లాడినట్లు తెలిసింది. ఇప్పటికే పులివెందుల కోర్టు సీబీఐ పిటిషన్ తిరస్కరించి.. ఆధారాలు ఇవ్వడం తమ పరిధిలోని అంశం కాదని తేల్చింది. మరోసారి రీపిటిషన్ వేయడమా లేక పైకోర్టుకు వెళ్లడమా అనే దానిపై సీబీఐ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : 'తహసీల్దార్లకు జీతాలు చెల్లించని కలెక్టర్లకూ వేతనాలు ఆపాలి'