మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు మీడియా ప్రతినిధులకు నోటీసులు పంపారు. జులై 24న వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత పులివెందులలో అతన్ని కొందరు మీడియా ఛానల్స్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. సెల్ ఫోన్లో రంగన్న మాటలను రికార్డు చేసిన ఛానల్స్ కు సీబీఐ నోటీసులు పంపింది. ఆ రోజు రంగన్నను ఇంటర్వ్యూ చేసిన కడప, పులివెందుల రిపోర్టర్లను ఫుటేజీ తీసుకుని విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారుల ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం రెండు ఛానల్స్ కు చెందిన మీడియా ప్రతినిధులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. రంగన్నను ఇంటర్వ్యూ చేసిందెవరు అనే దానిపై వారిని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బుధవారం మరికొందరు మీడియా ప్రతినిధులు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. రంగన్నకు చెందిన ఫుటేజీ, డాక్యుమెంట్లు అందించి విచారణకు సహకరించాలని సీబీఐ పేర్కొంది.