భక్తుల ఆరాధ్య దైవం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర ఆలయానికి కరోనా కష్టాలు వచ్చాయి. మూడు రాష్ట్రాల ప్రజలకు ఇలవేల్పుగా ఉన్న ఈ ఆలయం కడప జిల్లా రాయచోటిలో ఉంది. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని అధికారులు శనివారం రాత్రి మూసివేశారు. గ్రహణ సమయంలో తప్ప ఎప్పుడూ ఆలయం భక్తులతో కళకళలాడుతుంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలనుంచి కూడా వీరభద్రుని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు.
ఇటీవల కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు ఆలయ అధికారులు. అయితే, శనివారం రాయచోటి పట్టణంలో ఇరువురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి, రహదారుల రాకపోకలను నిలువరించారు. ఆలయ పరిధిలోని 25వ వార్డులో బట్టల వ్యాపారికి వైరస్ పాజిటివ్‌గా నిర్థరణ కాగా... ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్గా ప్రకటించారు. భక్తులను అనుమతించవద్దని ఆలయానికి అధికారులు సూచించారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం మూసివేసి, అర్చకులు రోజువారి పూజలను ఏకాంతంగా నిర్వహిస్తారని, ఆలయ ప్రారంభ తేదీని తరువాత ప్రకటిస్తామని, భక్తులు సహకరించి అప్పటివరకు ఆలయానికి రావద్దని కోరారు.
ఇవీ చదవండి:కరోనా భయం.. కారుతోనే అభయమంటూ..