పండగల సీజన్ ముగిసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలుతో పాటు తెలంగాణలోని హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరపనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టతనిచ్చింది. ఒడిశాలో ఒకటి, పశ్చిమబెంగాల్‌లోని మూడు అసెంబ్లీ సీట్లకు మాత్రం ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలు, 32 శాసనసభ స్థానాల ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఒకటో తేదీన ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈవోలు, వైద్యారోగ్య శాఖాధికారులతో ఈసీ సమీక్ష నిర్వహించింది.
కొవిడ్ కేసుల తీవ్రత, వరదలు, పండగల నేపథ్యంలో తమ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని అధికారులు తెలియజేశారని ఈసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అస్సాం, బిహార్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల అధికారులు కూడా ఇవే అంశాలను తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొంది. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పండగల అనంతరమే ఉప ఎన్నికలు నిర్వహించదలచినట్లు ఈసీ వివరించింది. ఫలితంగా బద్వేలు, హుజూరాబాద్ ఉప ఎన్నికలు దసరా, దీపావళి తర్వాతే జరగనున్నాయి.
ఒకవేళ అప్పటికి కొవిడ్ మూడో దశ విజృంభిస్తే ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకట సుబ్బయ్య మృతితో బద్వేలు స్థానం, తెలంగాణ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ స్థానం ఖాళీగా ఉన్న విషయం విదితమే. పశ్చిమ బెంగాల్, ఒడిశా అధికారులు మాత్రం తమ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులున్నాయని ఈసీకి తెలిపారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని మూడు, ఒడిశాలోని ఒక శాసనసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ అంగీకరించడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. ఎమ్మెల్యేగా గెలుపొందితే సీఎంగా ఆమె కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నికకావడానికి వీలుగా భవానీపుర్ నుంచి గెలుపొందిన శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది.
ఇదీ చూడండి: teachers day:గురుశిష్యులు బంధం.. అమోఘం..అద్వితీయం