ATM Thieves Arrested: అతడు చూసేందుకు ఖరీదైన దుస్తులు, మెడలో బంగారు గొలుసులు ధరించి ఏటీఎం కేంద్రాల వద్ద సంచరిస్తూ ఉంటాడు. వృద్ధులను, అమాయకులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు డ్రా చేయలేని వారిని గుర్తిస్తాడు. అనంతరం వారికి డబ్బులు డ్రా చేయించే క్రమంలో ఏటీఎం కార్డులను మార్చి బాధితుల సొమ్మును కాజేస్తాడు. ఇలా పలు చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లా ఏటీఎం దొంగను కడప పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తిపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 ఏటీఎం కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా తలపుల మండలానికి చెందిన శ్రీకాంత్‌నాయక్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటుపడ్డాడు. సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఏటీఎం కేంద్రాలను ఎంచుకున్నాడు. అతడు ఖరీదైన దుస్తులు ధరించి, మెడలో బంగారు గొలుసు, చేతికి ఉంగరాలు పెట్టుకొని ఏటీఎం కేంద్రాల వద్ద ఉంటాడు.
ఏటీఎం కేంద్రాల నుంచి నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే వారిలో వృద్ధులు, అమాయకులు, గ్రామీణ ప్రాంతాల వారిని లక్ష్యంగా చేసుకుంటాడు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమందికి ఇప్పటికీ ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బులు డ్రా చేయడం తెలియదు. ఇదే అతడికి ఆయుధంగా మారింది. అమౌంట్ డ్రా చేసుకోవటంరాని మహిళలు, వృద్ధులు ఏటీఎం మిషన్స్ వద్దకు వచ్చినప్పుడు.. వారు తనను పిలచేంతవరకు శ్రీకాంత్‌నాయక్ అక్కడే పడిగాపులు కాస్తాడు. ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు బాధితులు పిలవటంతో అదే అదునుగా భావించి.. వారికి సహయం చేసే ముసుగులో వారి ఒరిజినల్ ఏటీఎం కార్డును మార్చేసి ఇతడి వద్ద ఉన్న మరో నకిలీ ఏటీఎం కార్డును వారికి ఇస్తాడు.
అయితే ఇది గమనించని బాధితులు అదే తమ ఏటీఎం కార్డు అనుకొని నకిలీ కార్డును తీసుకొని వెళ్లిపోతారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే అతడు తన దగ్గర ఉన్న ఒరిజినల్ ఏటీఎం కార్డు ద్వారా వారి ఖాతాలో నుంచి డబ్బులను డ్రా చేసి వారి నగదును కాజేస్తాడు. ఇలా అతడు ఇప్పటికీ శ్రీకాళహస్తి, చంద్రగిరి, నెల్లూరు, అనంతపురం, కడప తదితర ప్రాంతాలలో 15 ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డాడు.
తాజాగా కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్బీఐ బ్యాంకు వద్ద ఓ వ్యక్తి నుంచి ఏటీఎం కార్డును మార్చేసి 20 వేల రూపాయలు దొంగలించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు నిందితుడు శ్రీకాంత్‌ను కడప శివారులో అరెస్టు చేశారు.
నిందితుడి నుంచి 27 గ్రాముల బంగారు గొలుసులు, లక్ష రూపాయలు నగదు, 24 ఏటీఎం కార్డులను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద ఇలాంటి వ్యక్తులు సంచరిస్తుంటారని.. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని కడప డీఎస్పీ షరీఫ్ సూచించారు.
మరోవైపు ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఏటీఎం మిషన్ నుంచి డబ్బులకు బదులు పాములు వచ్చాయి. దీంతో ఇది చూసిన ప్రజలు అది ఏటీఎం కేంద్రమా లేకుంటే పాముల పట్టా.. అనే అనుమానంతో.. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం పగలగొట్టి.. రూ.15 లక్షల చోరీ..
మరోవైపు అనకాపల్లి పూడిమడక రోడ్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి సమయంలో ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్ పగలగొట్టి రూ.15 లక్షల నగదును అపహరించారు. ఏటీఎం షెల్టర్ మూసేసి ఉండటంతో ఆదివారం అక్కడికి ఎవరూ వెళ్లలేదు. ఏటీఎం మిషన్ పనిచేయడంలేదని బ్యాంకు సిబ్బందికి సమాచారం అందడంతో ఆదివారం మధ్యాహ్నం సమయంలో సిబ్బంది వెళ్లి చూశారు. అయితే అక్కడ ఏటీఎంలో చోరీ జరిగినట్లు గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాలకు స్ప్రే చల్లి దుండగులు ఏటీఎం మెషిన్ లోని నగదును ఎత్తుకుపోయారు. క్లూస్ టీం వేలిముద్రలు సహకరించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా అదనపు ఎస్పీ క్రైమ్ సత్యనారాయణ అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ సీఐ దాడి మోహన్‌రావు తెలిపారు. ఒకవేళ పాత నేరస్థులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారనే అనుమానంతో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
కర్నూలులో ఇద్దరు దొంగలు అరెస్ట్..
కర్నూలు సమీపంలోని రాగ మయూరి కాలనీలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కొండపేట గ్రామానికి చెందిన ముంగా శంకర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి శ్రీధర్ అనే ఇద్దరూ గతంలో చేసిన నేరాలకు హైదరాబాద్ పోలీసులు చర్లాపల్లి జైల్లో ఉంచారు. అక్కడ ఒకరికొకరు పరిచయమై జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరూ కలిసి కర్నూలులో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ రాగమయురి కాలనీలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో పట్టపగలే దొంగతనాలకు పాల్పడ్డారని కర్నూలు డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు. వీరి నుంచి 18 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
సెంట్రీ వర్క్ షాప్‌లో అగ్ని ప్రమాదం..
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం గడియార స్తంభం వద్ద సోమవారం తెల్లవారుజామున సెంట్రీ వర్క్‌షాప్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనలో సెంట్రీ వర్క్‌షాప్‌లో ఉన్న సామాగ్రి మంటల్లో కాలిపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరగటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా సిగరెట్ కాల్చి.. ఆ ప్రాంతంలో పడేసిన కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో సుమారు రూ 1.5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమై ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: