కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మరో జలాశయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాలో ఇప్పటికే మైలవరం, కొండాపురం మండలంలో గండికోట రిజర్వాయర్లు ఉన్నాయి .తాజాగా ముద్దనూరు మండలంలో 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ముద్దనూరు మండలం ఆరవేటి పల్లె, దేనేపల్లి మధ్యలోని... రెండు కొండల నడుమ సుమారు 10 వేల కోట్ల రూపాయలతో భారీ జలాశయం ఏర్పాటుకు సంబంధించిన సర్వేను మూడు నెలల కిందటే నీటి పారుదల శాఖ అధికారులు పూర్తిచేశారు. .
సీఎం జగన్ చొరవతో....
బ్రిటీష్ కాలం నుంచి ఈ రిజర్వాయర్ ప్రతిపాదన ఉన్నప్పటికీ కార్య రూపం దాల్చలేదు. సీఎం జగన్ చొరవతో ఈ రిజర్వాయర్ కార్యరూపం దాల్చనుంది. గండికోట జలాశయానికి దిగువన ఇది ఏర్పాటు కానుంది . ఇది ఏర్పాటైతే గాలేరు-నగరి కాలువ ద్వారా గండికోటకు నీటిని తరలించి అక్కడినుంచి ఈ కొత్త జలాశయం నింపే యోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలోనే జమ్మలమడుగు నియోజకవర్గానికి విచ్చేసి నూతన రిజర్వాయరు ప్రారంభోత్సవం చేస్తానని... ఈ నెల 25న పులివెందుల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి-కమిటీల పేరుతో అమరావతిపై కుట్ర: దేవినేని