రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా కడపజిల్లాలో "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రాన్ని ప్రదర్శించిన 3 సినిమా థియేటర్లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈనెల 1వ తేదీన కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్, రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలో ఆ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించింది. కానీ ఆ మూడు థియేటర్ల యజమానులు మాత్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులకు వ్యతిరేకంగా మొదటి ఆట ప్రదర్శించారు. విషయం తెలిసిన స్థానిక రెవిన్యూ అధికారులు థియేటర్ యజమానులను హెచ్చరించారు. కానీ థియేటర్లపై మాత్రం చర్యలు తీసుకోలేదు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ద్వివేదీ కడప జాయింట్ కలెక్టర్ పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తున్నట్లు వెల్లడించారు. లక్ష్మీఎస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించినా అడ్డుకోవడంలో జేసీ విఫలం అయ్యారని అన్నారు. జిల్లాలోని మూడు థియేటర్లను సీజ్ చేయాలని సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. దీంతో కడప, పోరుమామిళ్ల, రైల్వేకోడూరు మండలాల తహశీల్దార్లు నిన్న సాయంత్రం మూడు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. లైసెన్స్‌లు రద్దు చేశారు. ఇక నుంచి ఏ చిత్రాన్ని ప్రదర్శించ కూడదని నోటీసులు ఇచ్చారు.
ఇవీ చదవండి